Jagan: మీ సంకల్పం చాలా గొప్పది!: ప్రధాని మోదీకి సీఎం జ‌గ‌న్ లేఖ‌

jagan writes letter to modi
  • ‘పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై’ పథకంపై వివ‌ర‌ణ‌
  • ఏపీలో 68,381 ఎకరాల భూమిని  పంచాం
  • రాష్ట్రం మీద ఆర్థిక‌ భారం ప‌డుతోంది
  • రాష్ట్రానికి నిధులు అందేలా చూడండి 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అమ‌లవుతోన్న ‘పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై’ పథకంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్య‌మంత్రి జగన్‌ లేఖ రాశారు. 2022 లోపు ఈ ప‌థ‌కం కింద ఇళ్ల నిర్మాణాల‌ను పూర్తి చేయాలన్న మోదీ సంకల్పం చాలా గొప్పదని ఆయ‌న ప్రశంసించారు.  

ఏపీలో ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు 68,381 ఎకరాల భూమిని పంచామ‌ని జగన్‌ వివ‌రించారు. అలాగే, 17,005 గ్రీన్‌ఫీల్డ్‌ కాలనీల్లో ఇప్ప‌టివ‌ర‌కు 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు. వాటిల్లో 28.35 లక్షల పక్కా ఇళ్లను నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు చెప్పారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పేద‌ల‌కు ఇళ్లు నిర్మించి ఇవ్వ‌డానికి రూ.50,944 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్లు జగన్‌ తెలిపారు. అలాగే, ఇళ్ల నిర్మాణంతో పాటు పేద‌ల‌కు మౌలిక వసతులు కల్పించడం కోసం రూ.34,104 కోట్ల నిధులు అవసరమవుతాయని ఆయ‌న మోదీకి లేఖ‌లో చెప్పారు.

ఇప్ప‌టికి తాము రూ.23,535 కోట్లు ఖర్చు చేశామ‌ని, ఇది రాష్ట్రానికి భారం అవుతుందని జగన్‌ పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం అండగా ఉండాలని ఆయ‌న చెప్పారు. ఈ మేర‌కు రాష్ట్రానికి నిధులు అందేలా చేయాల‌ని ముఖ్యమంత్రి కోరారు.
Jagan
Narendra Modi
Andhra Pradesh

More Telugu News