Nellore District: నెల్లూరు జీజీహెచ్ లో లైంగిక వేధింపులు?.. హౌస్ సర్జన్‌ ఆడియో వైరల్

Sexual harassment on students in  Nellore GGH
  • జీజీహెచ్‌లో కొనసాగుతున్న లైంగిక వేధింపులు
  • అధికారికి  ఘాటుగా బదులిచ్చిన బాధిత విద్యార్థిని
  • సోషల్ మీడియాలో కలకలం రేపిన ఆడియో
  • విచారణకు ఆదేశించిన ఇన్‌చార్జ్ కలెక్టర్
తన తండ్రి వయసున్న ఒక అధికారి  నుంచి లైంగిక వేధింపులు పడలేక ఓ వైద్య విద్యార్థిని మానసికంగా అల్లాడుతోంది. ఈ ఘటన నెల్లూరు జీజీహెచ్‌లో చోటుచేసుకుంది. హౌస్ సర్జన్ అయిన ఆ విద్యార్థిని పట్ల ఒక వైద్యాధికారి   వేధింపులతో కూడిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు ఫోన్ చేసి వేధిస్తున్న ఆ అధికారికి  సదరు హౌస్ సర్జన్ ఘాటుగా సమాధానం కూడా చెప్పింది.

నువ్వు నా సోల్‌మేట్‌వి, నా లైఫ్ పార్ట్‌నర్‌వి, వైజాగ్ కోడలయ్యేదానివి.. అన్న  మాటలకు బాధిత విద్యార్థిని బదులిస్తూ.. ఆ మాటలు ఏంటి సర్ అని, నాకు తెలిసినంత వరకు మీకు నా వయసు (23) ఉన్న పిల్లలు ఉంటారని అనుకుంటున్నానని పేర్కొంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నానని, నంబరును బ్లాక్ చేస్తే మరో నంబరు నుంచి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

నా రూములో ఏసీ లేకపోతే మీ రూముకు రావాలా? బీచ్‌కు రమ్మంటారా? ఏం మాటలు సర్ ఇవి? అని ప్రశ్నించింది. మీ వల్ల తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని, కొన్ని నెలలుగా పుస్తకాలు కూడా ముట్టుకోలేదని బాధిత విద్యార్థిని పేర్కొంది. విధులు నిర్వర్తిస్తున్నా హాజరు వేయడం లేదని వాపోయింది. ఆడియో వైరల్ కావడతో జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ విచారణకు ఆదేశించారు.

ఇదిలావుంచితే, రెండేళ్ల క్రితం ఇదే ఆసుపత్రిలో ఓ అధ్యాపకుడు ఓ వైద్య విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడిన ఆడియో వెలుగు చూడడం, తదనంతర పరిణామాలతో ప్రభుత్వం అతడిని విధుల నుంచి తప్పించి విచారణకు కమిటీ వేసింది.
Nellore District
GGH
Medical Student
Sexual harassment

More Telugu News