KTR: సిరిసిల్ల జిల్లాలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభం... ఇక హైదరాబాద్, కరీంనగర్ వెళ్లనవసరంలేదన్న కేటీఆర్

KTR inaugurates area hospital
  • తిప్పాపూర్ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్న కేటీఆర్
  • ఆక్సిజన్ కు కొరత లేదని వెల్లడి
  • వ్యాక్సినేషన్ పై విచారం
  • హైదరాబాదులోనే వ్యాక్సిన్ తయారవుతోందని వ్యాఖ్యలు
  • ఇక్కడి ప్రజలకు అందుబాటులో లేవని విచారం
రాజన్న సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్ లో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, కరోనా పాజిటివ్ వస్తే ఇకపై హైదరాబాద్, కరీంనగర్ వంటి నగరాలకు వెళ్లే అవసరంలేదని అన్నారు. ఆక్సిజన్ లభ్యత కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన వ్యాక్సినేషన్ తీరుతెన్నులపై విచారం వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తానికి సరిపోయే వ్యాక్సిన్ హైదరాబాదులోనే తయారవుతున్నా, తెలంగాణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం దురదృష్టకరమని అన్నారు. ఆయా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లలో 85 శాతం కేంద్రం తన వద్దే ఉంచుకుంటోందని, మిగిలిన 15 శాతంలోనే రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేయాలని షరతు విధించిందని తెలిపారు. ఇతర దేశాలకు వ్యాక్సిన్లు ఎగుమతి చేయకుండా వుంటే కనుక ఇక్కడి ప్రజలకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేవని కేటీఆర్ అన్నారు.

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ తగ్గుతోందని, ఒకవేళ మళ్లీ తీవ్రత పెరిగినా ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.
KTR
Area Hospital
Thippapur
Corona Virus
Telangana

More Telugu News