Vindhya Visakha: తెలుగు యాంకర్ వింధ్య విశాఖపై సోనూ సూద్ ప్రశంసల జల్లు

Sonu Sood appreciates anchor Vindhya Visakha
  • కరోనా పరిస్థితులపై స్పందించిన వింధ్య విశాఖ
  • తన వస్తువులు వేలం
  • వచ్చిన మొత్తాన్ని సోనూ సూద్ ఫౌండేషన్ కు విరాళం
  • రియల్ రాక్ స్టార్ అంటూ కొనియాడిన సోనూ సూద్
ప్రముఖ తెలుగు ప్రజెంటర్, స్పోర్ట్స్ యాంకర్ వింధ్య విశాఖ కరోనా సంక్షోభంలో తనవంతుగా స్పందించారు. దేశవ్యాప్తంగా విస్తృతస్థాయిలో సేవలందిస్తున్న సోనూ సూద్ ఫౌండేషన్ కు విరాళం అందించారు. తన వద్ద ఉన్న ఖరీదైన వస్తువులను వేలం వేసి, ఆ మొత్తాన్ని కరోనా సహాయక చర్యల నిమిత్తం విరాళంగా ఇచ్చారు. వింధ్య మంచి మనసు సోనూ సూద్ ను ఎంతగానో ఆకట్టుకుంది. దీనిపై ఆయనే స్వయంగా స్పందించారు. యాంకర్ వింధ్య విశాఖపై ప్రశంసలు జల్లు కురిపించారు.

"వింధ్య విశాఖా... మీరు రియల్ రాక్ స్టార్" అంటూ అభివర్ణించారు. "మీ విరాళానికి కేవలం థ్యాంక్స్ అనే ఒక్క మాట చెబితే సరిపోదు" అని పేర్కొన్నారు. "మీ విరాళంతో పేదల ముఖాలపై నవ్వులు పూస్తాయి. మీకు భవిష్యత్ లో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.

సోనూ సూద్ తన పట్ల స్పందించేసరికి వింధ్య విశాఖ ఆనందం అంతాఇంతా కాదు. నమ్మలేకపోతున్నానంటూ ఆమె సోషల్ మీడియాలో బదులిచ్చారు. "ఎంతో మిన్నగా సేవలు చేస్తున్న వ్యక్తి నుంచి అభినందనలు రావడంతో నాకు నిజంగా మాటలు రావడంలేదు. దేశానికి మీరు చేస్తున్న సేవలు అమోఘం సర్. ఇంతకుమించి ఇంకేమీ చెప్పలేను. మిమ్మల్నెప్పటికీ అభిమానిస్తుంటాం... మీకు మద్దతు ఇస్తుంటాం... ఎందుకంటే మీరు సూపర్ హీరో" అని వింధ్య విశాఖ పేర్కొన్నారు.

బుల్లితెర కార్యక్రమాలతో యాంకర్ గా కెరీర్ కొనసాగిస్తున్న వింధ్య విశాఖ ఐపీఎల్, కబడ్డీ టోర్నమెంట్ల ద్వారా తెలుగు టీవీ ప్రేక్షుకులకు మరింత దగ్గరైంది.
Vindhya Visakha
Sonu Sood
Donation
Corona Pandemic

More Telugu News