Andhra Pradesh: ఏపీలో నిదానించిన కరోనా వ్యాప్తి.... 25 నుంచి 19 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు

  • ఏపీలో వరుసగా 20 వేలకు లోపే కొత్త కేసులు
  • గత 24 గంటల్లో 16,167 మందికి పాజిటివ్
  • చిత్తూరు జిల్లాలో 2,967 మందికి కరోనా
  • రాష్ట్రంలో 21,385 మందికి కరోనా నయం
  • రాష్ట్రంలో 104 మంది మృతి
Corona positivity rate declines in AP

ఏపీలో కరోనా ఉద్ధృతి కొద్దిమేర నిదానించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల వరుసగా 20 వేలకు లోపే కొత్త కేసులు వెల్లడవుతున్నాయి. ఈ క్రమంలో కొన్నివారాల కిందట పరిస్థితితో పోల్చితే కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్టే భావించాలి. పాజిటివిటీ రేటు కూడా 25 నుంచి 19 శాతానికి తగ్గింది.

గడచిన 24 గంటల్లో 84,224 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 16,167 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,967 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 2,325 కేసులు వెల్లడయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 2 వేల లోపే కొత్త కేసులు వచ్చాయి.

అయితే రాష్ట్రంలో మరణాలు మాత్రం 100కి పైబడే నమోదవుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 104 మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలో 14 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మంది, విశాఖ జిల్లాలో 11 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. దాంతో, కరోనా మృతుల సంఖ్య 10,531కి పెరిగింది.

 అదే సమయంలో 21,385 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 16,43,557 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 14,46,244 మంది కోలుకున్నారు. ఇంకా 1,86,782 మందికి చికిత్స జరుగుతోంది.

More Telugu News