Sundar Pichai: చవకైన స్మార్ట్ ఫోన్ కోసం జియోతో కలిసి పనిచేస్తున్నాం: సుందర్ పిచాయ్

Sundar Pichai said they closely associates with Jio to make an affordable phone
  • ఆసియా-పసిఫిక్ ప్రాంత పాత్రికేయులతో పిచాయ్ భేటీ
  • వర్చువల్ విధానంలో మాట్లాడిన పిచాయ్
  • గతేడాది జియోతో స్మార్ట్ ఫోన్ తయారీ ఒప్పందం
  • జియో ప్లాట్ ఫార్మ్స్ లో పెట్టుబడులు
అల్ప, మధ్యస్థ ఆదాయ వర్గాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఓ చవకైన స్మార్ట్ ఫోన్ కోసం తమ భాగస్వామి జియోతో కలిసి కృషి చేస్తున్నామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన కొందరు పాత్రికేయులతో పిచాయ్ వర్చువల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ అందించడం తమ లక్ష్యాల్లో భాగమని, అందుకే తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. చవక ధర స్మార్ట్ ఫోన్ విషయంలో జియోతో కలిసి ముందుకు నడుస్తున్నామని చెప్పారు.

గతేడాది జియో ప్లాట్ ఫార్మ్స్ వేదికపై గూగుల్ సంస్థ రూ.33,737 కోట్లతో 7.7 శాతం వాటాలను చేజిక్కించుకుంది. ఈ క్రమంలో అన్ని సదుపాయాలతో కూడిన ప్రారంభస్థాయి స్మార్ట్ ఫోన్ తయారీకి జియోతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, తమ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు మార్కెట్లోకి తీసుకువస్తారు? ధర ఎంత? అనే విషయాలను ఇవాళ్టి సమావేశంలో సుందర్ పిచాయ్ వెల్లడించలేదు.

ఇక, డిజిటల్ ఇండియా దిశగా గూగుల్ తన వంతు సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు. ఇండియా డిజిటలైజేషన్ ఫండ్ (ఐడీఎఫ్)లో 10 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాదిలోనే దీనికి సంబంధించిన ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి గురించి స్పందిస్తూ... ఈ వైరస్ సంక్షోభం ప్రజల జీవితాల్లో సాంకేతికత ప్రాముఖ్యతను ఎత్తిచూపిందని పిచాయ్ వివరించారు.

"గూగుల్ మీట్ రూపకల్పన కానివ్వండి, లేక అది అన్ని టెలికాం నెట్వర్క్స్ లో పనిచేసే విధంగా అభివృద్ధి చేయడం కానివ్వండి, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల వినిమయానికి మరిన్ని అవకాశాలు కల్పించడం కానివ్వండి... మేం మరింత తీవ్రంగా శ్రమించడానికి కరోనా పరిస్థితులే కారణం" అని వివరించారు.
Sundar Pichai
Smart Phone
Google
Jio
India

More Telugu News