Marriage: 'నా చెల్లెల్ని కూడా పెళ్లాడితేనే మన పెళ్లి జరుగుతుంది' అన్న యువతి.. సరేనన్న పెళ్లికొడుకు.. కుదరదన్న పోలీసులు!
- కర్ణాటకలోని వేగమడుగు గ్రామంలో ఘటన
- మూగ, బధిర చెల్లెలి కోసం అక్క అసాధారణ నిర్ణయం
- యువకుడ్ని ఒప్పించిన వైనం
- అక్కాచెల్లెళ్లకు తాళికట్టిన యువకుడు
- చెల్లెలు మైనర్ అంటూ కేసు నమోదు చేసిన పోలీసులు
ఒకరు ఇద్దర్ని పెళ్లాడడం కొత్తేమీ కాదు. అయితే, కర్ణాటకలో ఓ అమ్మాయి తన చెల్లెల్ని కూడా పెళ్లి చేసుకోవాలని కాబోయే భర్తను పట్టుబట్టి మరీ ఒప్పించింది. కర్ణాటకలోని వేగమడుగు గ్రామానికి చెందిన నాగరాజప్ప, రాణెమ్మ దంపతులకు సుప్రియ, లలిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఇద్దరిలోకి చిన్నదైన లలిత మూగ, బధిర యువతి. దాంతో ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారని కుటుంబ సభ్యులు బెంగపడేవారు. అయితే, ఇంతలో పెద్దమ్మాయి సుప్రియకు ఉమాపతి అనే యువకుడితో పెళ్లి కుదిరింది. ఈ నెల 7న వారి పెళ్లి జరిగింది.
ఈ పెళ్లిలోనే ఆశ్చకర్యరమైన ఘటన జరిగింది. ఉమాపతి తాళి కట్టబోతుండగా, సుప్రియ అడ్డుచెప్పింది. తన చెల్లెలి పరిస్థితి వివరించి, ఆమెను కూడా పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటేనే తాను తాళి కట్టించుకుంటానని షరతు పెట్టింది. లేకపోతే ఈ పెళ్లి జరగదని తెగేసి చెప్పింది. దాంతో పెళ్లి మంటపంలో కలకలం రేగింది. అయితే, అక్కడి పెద్దలు మానవతాదృక్పథంతో వ్యవహరించి ఉమాపతికి నచ్చచెప్పడంతో, ఆ యువకుడు అక్కాచెల్లెళ్లు ఇద్దరికీ తాళికట్టాడు.
కానీ, అనూహ్యరీతిలో పోలీసులు రంగప్రవేశం చేసి, చిన్నదైన లలితకు ఇంకా మైనారిటీ తీరలేదంటూ కేసు నమోదు చేశారు.