కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ లేకుండా క్రొయేషియా వెళ్లిన భారత పైలెట్లు... 40 గంటల పాటు విమానంలోనే!
- కరోనా నేపథ్యంలో అనేక దేశాల్లో కఠిన ఆంక్షలు
- నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతి
- మంగళవారం ఢిల్లీ నుంచి క్రొయేషియా వెళ్లిన స్పైస్ జెట్ ప్లేన్
- ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోని పైలెట్లు
- ఎయిర్ పోర్టులోకి ప్రవేశాన్ని నిషేధించిన అధికారులు
స్పైస్ జెట్ యాజమాన్యం ఢిల్లీలోనే ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించి ఉంటే వారికా ఇబ్బంది తప్పేది. కానీ, వారికి కరోనా టెస్టులు చేయకపోవడంతో క్రొయేషియాలో ఊహించని అనుభవం ఎదురైంది. ఆ నలుగురు పైలెట్లకు జాగ్రెబ్ విమానాశ్రయంలో ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించారు. దాంతో వారు తమ విమానంలోనే 40 గంటల పాటు గడపాల్సి వచ్చింది.
ఆ స్పైస్ జెట్ విమానం తిరిగి భారత్ వచ్చేటప్పుడు కూడా క్రొయేషియా అధికారులు తమ నిబంధనలు వర్తింపజేశారు. ఆ విమానంలో ఎక్కేందుకు ప్రయాణికులెవరినీ అనుమతించలేదు సరికదా, కనీసం సరకు రవాణా కూడా జరపనివ్వలేదు. దాంతో, ఆ నలుగురు పైలెట్లతోనే స్పైస్ జెట్ విమానం ఖాళీగా ఢిల్లీ తిరిగొచ్చింది.