JP Nadda: కేరళలో కరోనా కేసులు పెరగడానికి మీ ర్యాలీలే కారణం: సోనియాగాంధీకి నడ్డా ఘాటు లేఖ

Kerala Rallies Caused Covid Spike says JP Nadda in his letter to Sonia Gandhi
  • కరోనాను కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు వాడుకుంటోంది
  • అందరు సీఎంలతో కలిసి ప్రధాని పని చేస్తున్నారు
  • అసత్య ప్రచారం చేయడంలో రాహుల్ ని మించినవారు లేరు
కరోనాపై యావత్ దేశం చేస్తున్న పోరాటాన్ని బలహీనపరచవద్దంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేఖ రాశారు. కరోనా మహమ్మారి అంశాన్ని కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. కరోనాను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని... అయినప్పటికీ కేంద్రంపై విమర్శలు గుప్పించడమే పనిగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శించారు.

కరోనా కట్టడి చేయడానికి ప్రధాని మోదీ అన్ని ప్రభుత్వ వ్యవస్థలతో కలిసి పని చేస్తున్నారని నడ్డా తెలిపారు. అందరు ముఖ్యమంత్రులతో కలిసి ప్రధాని పని చేస్తున్నారని చెప్పారు. మన భారతీయ సంస్థలు తయారుచేసిన వ్యాక్సిన్లపై తొలుత కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు 16 కోట్ల వ్యాక్సిన్లను కేంద్రం సరఫరా చేసిందని... ఇందులో 50 శాతం టీకాలను ఉచితంగా అందించిందని చెప్పారు.
 
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తున్నారని... కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సిన్ ను ఫ్రీగా ఎందుకు ఇవ్వడం లేదని నడ్డా ప్రశ్నించారు. అసత్య ప్రచారం చేయడంలో రాహుల్ గాంధీని మించినవారు లేరని చెప్పారు. లాక్ డౌన్ విధించడాన్ని తొలుత రాహుల్ వ్యతిరేకించారని... ఇప్పుడు లాక్ డౌన్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎక్కడ పడితే అక్కడ నిరసన కార్యక్రమాలను చేపట్టడం, కరోనా వ్యాప్తి చెందే కార్యక్రమాలకు హాజరవడం వంటివి చేశారని అన్నారు. కేరళలో కాంగ్రెస్ నేతలు చేపట్టిన భారీ ఎన్నికల ర్యాలీలే ఆ రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి కారణమని ఆరోపించారు.

ఢిల్లీలో చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఇప్పటిది కాదని... 2012లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే దానిపై డిమాండ్లు ఉన్నాయని నడ్డా చెప్పారు. ఈ ప్రాజెక్టుపై కేంద్రం అన్ని వివరణలు ఇచ్చినప్పటికీ... కాంగ్రెస్ పార్టీ మాత్రం విమర్శలు మానుకోలేదని మండిపడ్డారు. గత 70 ఏళ్లలో ఆరోగ్యరంగంలో మన దేశం పెట్టిన పెట్టుబడులు చాలా తక్కువని అన్నారు. ఈ దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది ఏ పార్టీ? అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యరంగంలో అనేక మార్పులను తీసుకొచ్చిందని చెప్పారు.
JP Nadda
BJP
Sonia Gandhi
Rahul Gandhi
Congress
Corona Virus
Kerala

More Telugu News