MK Stalin: పిల్లవాడి పెద్దమనసుకు అచ్చెరువొందిన తమిళనాడు సీఎం

Tamilnadu CM MK Stalin send a gift to Madhurai kid
  • తమిళనాడులో కరోనా బీభత్సం
  • సైకిల్ కోసం దాచుకున్న డబ్బును విరాళంగా ఇచ్చిన చిన్నారి
  • ఒక కరోనా రోగికి తన డబ్బుతో చికిత్స చేయాలని లేఖ
  • ముగ్ధుడైన సీఎం స్టాలిన్
  • చిన్నారికి కానుకగా సైకిల్
ఇటీవల తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎంకే స్టాలిన్ ఓ పిల్లవాడి చర్యకు ఫిదా అయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా దయనీయ పరిస్థితులు నెలకొన్న తరుణంలో హరీశ్ వర్మన్ (7) అనే చిన్నారి తాను దాచుకున్న డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇచ్చి పెద్దమనసు చాటుకున్నాడు. ఆ పిల్లవాడి దాతృత్వం పట్ల స్పందించిన సీఎం స్టాలిన్ కానుక ఇచ్చి ఆ బాలుడ్ని సంతోషానికి గురిచేశారు.

మధురైకి చెందిన హరీశ్ వర్మన్ ఓ సైకిల్ కొనుక్కోవాలని రెండేళ్లుగా తల్లిదండ్రులు ఇచ్చే  డబ్బు దాచుకుంటున్నాడు. హరీశ్ తండ్రి ఓ ఎలక్ట్రీషియన్. కాగా, రాష్ట్రంలో కరోనా కారణంగా ఉత్పన్నమైన విపత్కర పరిస్థితులు ఆ బాలుడ్ని కదిలించాయి. ఈ నేపథ్యంలో, తాను దాచుకున్న డబ్బును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చేశాడు. తాను అందించిన సొమ్మును ఒక కరోనా రోగి చికిత్సకు ఖర్చు చేయాలని లేఖ రాశాడు.

ఈ లేఖ విషయం తెలుసుకున్న సీఎం స్టాలిన్ ముగ్ధుడయ్యారు. ఆ బాలుడికి ఓ సైకిల్ ను కానుకగా పంపారు. అంతేకాదు, ఫోన్ చేసి ఆ చిన్నారితో మాట్లాడారు. సీఎం నుంచి ఊహించని విధంగా బహుమానం వచ్చేసరికి చిన్నారి హరీశ్ వర్మన్ ఆనందం అంతాఇంతా కాదు. ఇక అతడి తల్లిదండ్రులైతే, సీఎం అంతటివాడు తమతో మాట్లాడేసరికి ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు.
MK Stalin
Harish
Cycle
Donation
Madhurai
Tamilnadu

More Telugu News