కరోనా వ్యాక్సిన్లపై జీఎస్టీ రద్దు!

Union Government to waive GST On Covid Vaccines
  • కేంద్ర ప్రభుత్వ యోచన
  • మరింత మంది వ్యాక్సిన్ వేసుకుంటారని అభిప్రాయం
  • ధర తగ్గితే ప్రైవేటుకూ ప్రజలు వెళ్తారన్న ఆలోచన
  • జీఎస్టీ మండలి ఓకే అంటే అమల్లోకి నిర్ణయం
కరోనా వ్యాక్సిన్లపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఒక్కో వ్యాక్సిన్ డోసు ధరను రూ.1,200 వరకు తగ్గించాలని యోచిస్తోంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా వ్యాక్సినేషన్ లో చురుగ్గా పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

జీఎస్టీ తగ్గింపుతో వ్యాక్సిన్ ధర తగ్గుతుందని, దాని వల్ల ప్రైవేటులో ఎక్కువ మంది ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కరోనా ఔషధ ముడిసరుకులపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. అదే రీతిలో కరోనా వ్యాక్సిన్లపై ఉన్న 5 శాతం జీఎస్టీనీ రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

‘‘వ్యాక్సిన్లపై జీఎస్టీ రద్దును జీఎస్టీ మండలి ఆమోదించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో మండలిలోని సభ్యులెవరూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించకపోవచ్చు. కేంద్రం నిర్ణయంతో అన్ని రాష్ట్రాల ప్రజలకు లబ్ధి కలుగుతుంది. వ్యాక్సిన్లపై జీఎస్టీని రద్దు చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు’’ అని ఓ అధికారి చెప్పుకొచ్చారు.

వాస్తవానికి ఇటీవలే కొవిషీల్డ్, కొవాగ్జిన్ ధరలను ఆయా టీకాల తయారీ సంస్థలు ప్రకటించాయి. కొవిషీల్డ్ ను రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600కు ఇస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రకటిస్తే.. ఆ మరుసటి రోజే కొవాగ్జిన్ ను రాస్ట్రాలకు రూ.600, ప్రైవేటుకు రూ.1,200కు ఇస్తామని ప్రకటించింది. ధరలు ఎక్కువగా ఉండడంతో ఆయా సంస్థలపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సీరం దిగివచ్చింది. రాష్ట్రాలకు రూ.300కే ఇస్తామంటూ వెల్లడించింది.
Go Back to Shorts
COVID19
COVAXIN
Covishield
Corona Vaccines
GST

More Telugu News