Bombay High Court: సభ్యులు చేసే అభ్యంతరకర పోస్టులకు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లను బాధ్యులను చేయలేం: బాంబే హైకోర్టు

Bombay High Court comments on Whatsapp group admins issue
  • అడ్మిన్లపై క్రిమినల్ నేరం మోపలేమన్న నాగ్ పూర్ బెంచ్
  • కిశోర్ తరోనే కేసులో వ్యాఖ్యలు
  • కిశోర్ తరోనే ఓ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్
  • గ్రూపులో అభ్యంతరకర పోస్టు
  • కిశోర్ చర్యలు తీసుకోలేకపోయాడన్న ప్రాసిక్యూషన్
  • క్వాష్ పిటిషన్ వేసిన కిశోర్
బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ ఓ కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వాట్సాప్ గ్రూప్ లో సభ్యులు చేసే పోస్టులకు అడ్మిన్లను బాధ్యులను చేయలేమని నాగ్ పూర్ బెంచ్ పేర్కొంది. సభ్యులు చేసే తప్పిదాలకు అడ్మిన్లపై క్రిమినల్ నేరం మోపలేమని అభిప్రాయపడింది. 33 ఏళ్ల కిశోర్ తరోనే అనే వ్యక్తిపై వచ్చిన ఆరోపణల కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది.

జస్టిస్ జడ్ఏ హక్, ఏబీ బోర్కర్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ సందర్భంగా స్పందిస్తూ... వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లకు పరిమితంగానే అధికారాలు ఉంటాయని, సభ్యులను గ్రూప్ కు యాడ్ చేయడం, గ్రూప్ నుంచి తొలగించడం వంటి అధికారాలే ఉంటాయని, అంతే తప్ప ఆ సభ్యులు పోస్టు చేసే కంటెంట్ ను క్రమబద్ధీకరించడం, సెన్సార్ చేయడం వంటి అధికారాలు ఉండవని పేర్కొంది.

కిశోర్ తరోనే ఓ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్. 2016లో ఆ గ్రూప్ లోని ఓ సభ్యుడు ఓ మహిళపై చేసిన అభ్యంతరకర పోస్టును కిశోర్ అడ్డుకోలేకపోయాడని, తగిన చర్యలు తీసుకోలేకపోయాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. దీనిపై కిశోర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, నాగ్ పూర్ బెంచ్ పైవ్యాఖ్యలు చేసింది.
Bombay High Court
Nagpur Bench
Whatsapp Admin
Maharashtra

More Telugu News