COVID19: కొవిడ్​ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు పేలి 27 మంది మృతి

At least 27 dead in fire at Baghdad hospital for Covid 19 patients
  • ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ప్రమాదం
  • 34 మందికి గాయాలు.. పలువురి పరిస్థితి విషమం
  • 200 మందిని కాపాడామన్న దేశ ఆరోగ్య శాఖ
  • సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన ప్రధాని
  • ఆసుపత్రి అధికారులకు నోటీసులు
ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఉన్న కొవిడ్ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం సంభించింది. ఆక్సిజన్ సిలిండర్లు పేలి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 27 మంది మరణించగా 34 మంది గాయపడ్డారు. గాయాలైన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఇబ్న్ అల్ ఖతీబ్ హాస్పిటల్ లో శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించి ఆదివారం ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటనను విడుదల చేసింది.


ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది, రక్షణ శాఖలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయని పేర్కొంది. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పింది. చనిపోయిన వారిలో పేషెంట్లతో పాటు వారి వెంట ఉన్న వారూ ఉన్నారని తెలిపింది. 200 మందిని కాపాడినట్టు చెప్పింది. ఎంత మంది చనిపోయారో సహాయ చర్యలు పూర్తయిన తర్వాతగానీ తెలియదని ప్రకటించింది.

కాగా, ప్రమాద ఘటనపై ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ కదీమీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఆసుపత్రి మేనేజర్, భద్రతా మేనేజర్, ఆసుపత్రిలోని పరికరాల నిర్వహణ చూసే అధికారులకు నోటీసులు జారీ చేశారు. ప్రమాద ఘటనపై వారినీ విచారించాలని ఆదేశించారు.
COVID19
Iraq
COVID19 Hospital
Oxygen
Explosion

More Telugu News