Nara Lokesh: పబ్లిక్ పరీక్షలపై సర్కారు మొండి వైఖరి వీడకపోతే కోర్టుకు వెళతాం: నారా లోకేశ్

Nara Lokesh warns AP Govt over public exams
  • పది, ఇంటర్ పరీక్షలు జరిపేందుకు సర్కారు నిర్ణయం
  • వాయిదా వేయాలంటున్న లోకేశ్
  • విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వద్దంటున్నారని వెల్లడి
  • నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారని వివరణ
ఏపీ సర్కారు పది, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించాలని కృతనిశ్చయంతో ఉండగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ప్రాణాలు పణంగా పెడతారా అంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 ఏపీ సర్కారు పబ్లిక్ పరీక్షలను వాయిదా వేయాల్సిందేనంటూ లోకేశ్ గత కొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై లోకేశ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పరీక్షలు నిర్వహించాలన్న మొండివైఖరిని సర్కారు విడనాడాలని డిమాండ్ చేశారు. ఒకవేళ పరీక్షలు చేపట్టాలని ప్రభుత్వం ముందుకు వెళితే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని లోకేశ్ హెచ్చరించారు.

కరోనా సోకితే కనీసం ఆసుపత్రుల్లో బెడ్ కూడా దొరకని పరిస్థితి ఉందని, ఔషధాలకూ విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని అన్నారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ ఎంతో ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నా ప్రభుత్వానికి తలకెక్కడంలేదని విమర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పరీక్షలు వద్దనే కోరుకుంటున్నారని, తాము వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేకరణ జరిపితే 80 శాతం మంది పరీక్షలు ఇప్పుడు వద్దంటున్నారని వివరించారు.

లోపభూయిష్టమైన కరోనా మేనేజ్ మెంట్ తో ప్రభుత్వం విఫలమైందని, ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందడంలేదని ఆరోపించారు. సెకండ్ వేవ్ లో కరోనా విలయతాండవం చేస్తుంటే ఏపీ సర్కారు మరణాలను తక్కువ చేసి చూపిస్తోందని అన్నారు.
Nara Lokesh
Public Exams
Postpone
YSRCP
AP High Court
TDP
Corona Virus
Andhra Pradesh

More Telugu News