Maharashtra: ప్రపంచంలో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇండియాలో!

France Firm says Worlds Biggest Nuclear Power Plant in India
  • మహారాష్ట్రలోని జైతాపూర్ ప్రాంతంలో నిర్మితం 
  • ఈపీఆర్ రియాక్టర్లను అందించనున్న ఫ్రాన్స్ సంస్థ
  • నిర్మితమైతే 10 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
ప్రపంచంలోనే అతి పెద్దదైన అణు విద్యుత్ ప్లాంటు మహారాష్ట్రలోని జైతాపూర్ ప్రాంతంలో నిర్మితం కానుందని, దీనికి అవసరమైన ఆరు మూడవ తరం ఈపీఆర్ రియాక్టర్లను తామే అందించనున్నామని ఫ్రాన్స్ కు చెందిన ఇంధన సంస్థ ఈడీఎఫ్ ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు ఏళ్ల క్రితమే ప్రణాళికలు వేసినప్పటికీ, విపక్షాలు, స్థానికుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో వాయిదా పడుతూ వచ్చింది.

తాజాగా, ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఇంజనీరింగ్ పరికరాలను అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని ఈడీఎఫ్ వెల్లడించింది. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంటు పూర్తయితే 10 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ తో 7 కోట్ల ఇళ్లకు అవసరమైన విద్యుత్ ను సరఫరా చేయవచ్చు. నిర్మాణం పూర్తి కావడానికి కనీసం 15 సంవత్సరాల సమయం పడుతుందని అంచనా.

సమీప భవిష్యత్తులోనే ఇండియాకు, తమ సంస్థకు మధ్య కాంట్రాక్టు తుది రూపును సంతరించుకుంటుందని ఈడీఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం తమ అధికారులు భారత్ తో ప్రత్యేకంగా చర్చిస్తున్నారని తెలిపింది. ప్లాంటు మొత్తాన్నీ తామే నిర్మించడం లేదని, యూఎస్ కు చెందిన తమ భాగస్వామ్య సంస్థ జీఈ స్టెమ్ పవర్ తో కలిసి న్యూక్లియర్ రియాక్టర్లను సరఫరా చేస్తామని తెలిపింది.

భారత ప్రభుత్వ అధీనంలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ (ఎన్సీపీఐఎల్) ఈ ప్లాంటును చేపట్టింది. ఈ ప్రాజెక్టుపై తమ ఆసక్తిని ఇప్పటికే వెల్లడించిన ఈడీఎఫ్, డీల్ విలువ, ఒక్కో రియాక్టర్ కు వసూలు చేసే మొత్తం తదితరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే, ఈ రంగంలోని నిపుణుల అంచనా ప్రకారం, దీని విలువ వేల కోట్లల్లోనే ఉండనుంది.

దాదాపుగా 20 సంవత్సరాల క్రితమే ఈ ప్లాంటు నిర్మాణ ఆలోచనను చేయగా, స్థానికుల నుంచి ఎంతో వ్యతిరేకత వచ్చింది. ఆపై 2011లో జపాన్ లోని ఫుకుషిమాలోని న్యూక్లియర్ ప్లాంటులో జరిగిన ఘోర దుర్ఘటన తరువాత, ఈ ప్రాజెక్టు వాయిదా పడుతూ వచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే 25 వేల మంది స్థానికులకు దీర్ఘకాల ఉపాధి లభిస్తుందని, నిర్మితమైన తరువాత 2,700 మందికి శాశ్వత ఉపాధి లభిస్తుందని ఈడీఎఫ్ అంచనా వేసింది.
Maharashtra
Nuclear Power Pland
France Sompany

More Telugu News