Edappadi Palaniswami: సీఎం పళనిస్వామిపై పరువునష్టం దావా.. నోటీసులు పంపిన మద్రాస్ హైకోర్టు!
- డీఎంకే నేత రాజేంద్రన్ ఒక యువతిపై అత్యాచారయత్నం చేశారన్న పళనిస్వామి
- రూ. కోటి నష్టపరిహారం దావా వేసిన రాజేంద్రన్
- ఈరోజు పిటిషన్ ను విచారించిన హైకోర్టు
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. డీఎంకే నేత సూళూరు ఎం. రాజేంద్రన్ వేసిన పరువునష్టం దావాలో ఈ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా కోయంబత్తూరులో పళనిస్వామి ప్రసంగిస్తూ రాజేంద్రన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రైల్లో ఒక యువతిపై రాజేంద్రన్ అత్యాచారయత్నం చేశారని పళనిస్వామి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై హైకోర్టులో రాజేంద్రన్ పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించే రీతిలో ముఖ్యమంత్రి వ్యవహరించారని పేర్కొన్నారు.
రైల్లో తాను ప్రయాణిస్తున్న సమయంలో అత్యవసరంగా మూత్రవిసర్జన చేయడం కోసం పైబెర్త్ నుంచి కిందకు దిగుతుండగా... కింద ఉన్న యువతిపై పడ్డానని పిటిషన్ లో రాజేంద్రన్ పేర్కొన్నారు. అయితే, ఆమె పట్ల తాను అసభ్యంగా ప్రవర్తించానని భావించిన సదరు యువతి తనపై పోలీసులకు సమాచారం ఇచ్చారని చెప్పారు. అయితే, ఆ తర్వాత తన పరిస్థితిని ఆమెకు వివరించి, ఆమెను శాంతింపజేశానని తెలిపారు.
అయితే 15 రోజుల తర్వాత తనపై పోలీసులు కేసు పెట్టారని, ఈ అంశంపై ఇప్పటికే కోర్టు తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని తెలిపారు. అయితే తాను చేయని లైంగికదాడిని చేసినట్టుగా పళనిస్వామి అసత్య ఆరోపణలు చేశారని... తన పరువుకు భంగం కలిగేలా ప్రవర్తించారని... రూ. కోటి నష్టపరిహారం కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఈరోజు హైకోర్టు విచారణకు వచ్చింది. వాదనల అనంతరం పళనిస్వామికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.