Corona Virus: కరోనా ప్రభావం... మళ్లీ పెరుగుతున్న నిరుద్యోగ రేటు

  • దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
  • కఠిన ఆంక్షల దిశగా ప్రభుత్వాలు
  • అలముకుంటున్న లాక్‌డౌన్‌ భయాలు
  • సొంతూళ్లకు పయనమవుతున్న వలస కార్మికులు
Corona effect Unemployment rate is increasing Again

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు కఠిన ఆంక్షలు ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూలు కొనసాగుతున్నాయి. ఇక తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ తప్పదేమోనన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలో మరోసారి నిరుద్యోగం పెరిగిపోతోందని ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. ఏప్రిల్‌ 11తో ముగిసిన వారంలో నిరుద్యోగ రేటు 8.6 శాతానికి చేరిందని తెలిపింది. రెండువారాల క్రితం అది 6.7 శాతంగా ఉండేదని పేర్కొంది.

లాక్‌డౌన్‌ భయంతో పట్టణాల నుంచి వలస కార్మికులు తిరిగి సొంత ప్రాంతాలకు తిరిగి వెళుతున్నారని సీఎంఐఈ తెలిపింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 10 శాతానికి చేరనుందని తెలిపింది. కరోనా తీవ్రత అత్యంత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో తొలిసారి రెండో దఫా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇక పూర్తిస్థాయి లాక్‌డౌన్‌పై ఈ వారం నిర్ణయం తీసుకుంటామని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

సోమవారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1,68,912 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 1,35,27,717కి చేరింది. ఫలితంగా అమెరికా తరవాత వైరస్‌ ధాటికి తీవ్రంగా ప్రభావితమైన దేశాల జాబితాలో బ్రెజిల్‌ను వెనక్కి నెట్టి భారత్ రెండో స్థానానికి చేరింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. వ్యాపారాలు దెబ్బతిని రానున్న రోజుల్లో నిరుద్యోగ రేటు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

More Telugu News