Andhra Pradesh: పర్యాటకులకు గుడ్ న్యూస్.. 18 నెలల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న పాపికొండల పర్యటన
- కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత పర్యటన నిలిపివేత
- 15 నుంచి తిరిగి విహార యాత్ర ప్రారంభం
- పర్యాటకుల కోసం త్వరలో ఆన్‌లైన్‌లో టికెట్లు
ఏపీ, తెలంగాణలోని పర్యాటకులకు ఇది శుభవార్తే. గోదావరిలో విహరిస్తూ పాపికొండల అందాన్ని వీక్షించే అవకాశం మరోమారు దక్కనుంది. దాదాపు 18 నెలల పాటు నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభం కానుంది.
తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం తర్వాత అధికారులు పాపికొండల పర్యటనను నిలిపివేశారు. తాజాగా, ఏపీ పర్యాటకశాఖ బోటుకు జలవనరుల శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు.
ఈ క్రమంలో ఈ నెల 15న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం సింగనపల్లి (కంపెనీ) నుంచి బోటు బయలుదేరుతుందని ఉభయగోదావరి జిల్లాల ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ (కాకినాడ) టీఎస్ వీరనారాయణ తెలిపారు.పాపికొండల పర్యాటకుల సౌకర్యార్థం త్వరలోనే ఆన్‌లైన్‌లో టికెట్లను ఉంచుతామన్నారు.