Stock Market: ఆర్బీఐ ప్రకటనతో.. భారీ లాభాలలో ముగిసిన మార్కెట్లు
- కీలక వడ్డీ రేట్లలో మార్పులేదని ఆర్బీఐ ప్రకటన
- భారత్ వృద్ధి రేటు ఆకర్షణీయమన్న ఐఎంఎఫ్
- 460.37 పాయింట్ల లాభాన్ని పొందిన సెన్సెక్స్
ఓపక్క కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ, దాని ప్రభావం మాత్రం ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లపై పడలేదు. కీలక వడ్డీ రేట్ల విషయంలో మార్పు లేదనీ, వాటిని యథాతథంగా వుంచుతున్నామనీ పేర్కొంటూ.. ఈ రోజు ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ప్రకటించడం మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపింది. అలాగే, భారత్ వృద్ధిరేటు ఆకర్షణీయంగా ఉంటుందని ఐఎంఎఫ్ చేసిన తాజా అంచనా కూడా బాగా పనిచేసింది. పర్యవసానంగా మన మార్కెట్లు భారీ లాభాలను దండుకున్నాయి.
అసలు ఈ రోజు ఉదయం మార్కెట్లు ఓపెన్ అయిన దగ్గర నుంచీ సెన్సెక్స్ లాభాల్లోనే పయనించింది. ఆ తర్వాత ఆర్బీఐ ప్రకటన రావడంతో మదుపరులు మరింత జోష్ తో కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో సెన్సెక్స్ 460.37 పాయింట్ల లాభంతో 49661.76 వద్ద.. 135.55 పాయింట్ల లాభంతో నిఫ్టీ 14819.05 వద్ద క్లోజయ్యాయి.
ఇక నేటి సెషన్ లో, పీఐ ఇండస్ట్రీస్, ఇన్ఫో ఎడ్జ్, మైండ్ ట్రీ, అపోలో హాస్పిటల్, ఆర్తి ఇండస్ట్రీస్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర షేర్లు లాభాలు గడించగా.. అదానీ ఎంటర్ ప్రైజస్, అదానీ పోర్ట్స్, కోల్గెట్, అమర్ రాజా బ్యాటరీ తదితర షేర్లు నష్టాలు పొందాయి.