Corona Virus: ఓపక్క కరోనాతో బాధపడుతూ.. మరోపక్క మీడియా టీమ్ తో సమావేశం నిర్వహించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ప్రతిపక్షాల విమర్శలు!

Corona positive Imran Khan held meeting with his media team
  • ఇటీవల ఇమ్రాన్ ఖాన్ కు కరోనా పాజిటివ్
  • తన మీడియా బృందంతో సమావేశం
  • సామాజిక మాధ్యమాల్లో ఫొటో
  • విపక్షాల ఆగ్రహం
  • ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కరోనా బారినపడడం తెలిసిందే. అయితే కరోనా పాజిటివ్ వచ్చినా ఆయన తన మీడియా టీమ్ తో సమావేశం నిర్వహించి విమర్శలకు గురయ్యారు. 68 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ఇటీవలే కరోనా నివారణ కోసం చైనా తయారీ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ వ్యాక్సిన్ తీసుకున్న కొన్నిరోజులకే ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా కరోనా సోకింది.

అయితే ఇమ్రాన్ ఖాన్ నిన్న తన మీడియా బృందంతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో దర్శనమివ్వడంతో విమర్శల దాడి మొదలైంది. ఈ ఫొటోను ఆ సమావేశానికి హాజరైన పాక్ ప్రసార శాఖ మంత్రి షిబ్లీ ఫరాజ్, ఫైజల్ జావెద్ అనే ప్రజాప్రతినిధి పంచుకున్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తి, పైగా ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడం ఏంటని విపక్షాలు దుమ్మెత్తి పోశాయి. ఇమ్రాన్ ఖాన్  ఈ సమావేశాన్ని బనిగలాలోని తన నివాసంలో గురువారం నాడు నిర్వహించినట్టు పాక్ మీడియా వెల్లడించింది.

దేశంలో మూడో కరోనా తాకిడి నడస్తున్న వేళ స్వయంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కరోనా ప్రోటోకాల్ ఉల్లంఘించారని విపక్ష నేతలు మండిపడ్డారు. అంతేకాదు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఈ సమావేశానికి హాజరైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Corona Virus
Imran Khan
Positive
Meeting
Media Team
Pakistan

More Telugu News