Future Group: రిలయన్స్‌-ఫ్యూచర్‌ డీల్‌కు ఎదురుదెబ్బ.. ముందుకు వెళ్లొద్దన్న ఢిల్లీ హైకోర్టు

Delhi High Court Ordered Future retail not to move further in reliance deal
  • రిలయన్స్‌ గ్రూప్‌తో ఫ్యూచర్‌ రిటైల్‌ విక్రయ ఒప్పందం
  • సవాల్‌ చేసిన అమెజాన్‌
  • అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టులో అమెజాన్‌కు అనుకూల తీర్పు
  • ఒప్పంద ప్రక్రియను నిలిపివేయాలన్న ఢిల్లీ హైకోర్టు
  • మధ్యవర్తిత్వ కోర్టు ఆదేశాల్ని ఫ్యూచర్‌ కావాలనే బేఖాతరు చేసిందని స్పష్టం
కిశోర్‌ బియానీ నేతృత్వంలోని రిటైల్ దిగ్గజం ఫ్యూచర్‌ గ్రూప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్‌ గ్రూప్‌తో కుదిరిన రూ.24,713 కోట్ల విక్రయ ఒప్పందాన్ని నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు గురువారం ఆదేశించింది. ఈ విషయంలో ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. సింగపూర్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు ఆదేశాల్ని ఫ్యూచ‌ర్స్ రిటైల్  ఉద్దేశపూర్వకంగానే బేఖాతరు చేసిందని అభిప్రాయపడింది.

అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వయోజనులకు కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు వీలుగా ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.20 లక్షల నగదు అందజేయాలని ఫ్యూచర్‌ గ్రూప్‌తో పాటు ఆ సంస్థ డైరెక్టర్లను కోర్టు ఆదేశించింది. సీఈవో కిశోర్ బియానీ, ఇత‌రుల ఆస్తుల‌ను జ‌ప్తు చేయాల‌ని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వ‌చ్చేనెల 28వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కిశోర్ బియానీ, త‌దిత‌రుల‌ను ఆదేశించింది. అలాగే, మధ్యవర్తిత్వ కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించినందుకు 3 నెలల జైలు శిక్ష ఎందుకు విధించకూడదో కూడా తెలపాలని కోరింది.  

ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ గత ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ.24,713 కోట్లు. ఇదిలా ఉంటే.. ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌లో అమెజాన్‌ 2019లో 49 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్‌ కూపన్స్‌కు 7.3 శాతం మేర ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా ఉంది. దీంతో మూడేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఫ్యూచర్‌ రిటైల్‌ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు దఖలు పడింది.

అయితే, రిలయన్స్‌-ఫ్యూచర్‌ మధ్య కుదిరిన ఒప్పందం ఈ నిబంధనను ఉల్లంఘిస్తోందని అమెజాన్‌ వాదిస్తోంది. దీంతో సింగపూర్‌ మధ్యవర్తిత్వ కోర్టులో ఈ ఒప్పందాన్ని సవాల్‌ చేసింది. కోర్టు దీనిపై స్టే విధించింది. తుది నిర్ణయం తీసుకునే వరకు ఒప్పందంపై ముందుకెళ్లొద్దని ఆదేశించింది.
Future Group
Reliance
Kishore Biyani
Delhi High Court
Amazon

More Telugu News