Russia: బైడెన్‌ తన గుణాలనే నాలో చూసుకుంటున్నారు.. అమెరికా అధ్యక్షుడి కామెంట్స్‌పై పుతిన్‌ సెటైర్లు

  • అమెరికా, రష్యా మధ్య దిగజారుతున్న సంబంధాలు
  • అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌ జోక్యం చేసుకున్నారని నివేదిక
  • పుతిన్‌ను కిల్లర్‌గా అభివర్ణించిన బైడెన్‌
  • మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
  • సెటైర్లతో స్పందించిన పుతిన్‌
Putin Responds sattirically on Biden Killer Comment

చిరకాల ప్రత్యర్థులు అమెరికా, రష్యా మధ్య సంబంధాలు మరింత దిగజారే సూచనలు కనిపిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అగ్రరాజ్యాధిపతి జో బైడెన్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. పుతిన్‌ను బైడెన్ కిల్లర్‌గా అభివర్ణించిన విషయం తెలిసిందే.

బైడెన్ వ్యాఖ్యలపై పుతిన్‌ తనదైన శైలిలో స్పందించారు. ‘మనలోని గుణాలే మనకు ఇతరుల్లోనూ కనిపిస్తుంటాయి’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పరోక్షంగా బైడెన్‌ స్వయంగా కిల్లర్‌ కాబట్టే తననూ కిల్లర్‌గా చూస్తున్నారనే అర్థం వచ్చేలా పుతిన్‌ మాట్లాడారు. తాను ఈ వ్యాఖ్యలు సరదాగా చేయడం లేదని దీంట్లో లోతైన తత్వం ఉందని వ్యాఖ్యానించారు. బైడెన్‌ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. రష్యా ప్రయోజనాల కోసం అమెరికాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

నవంబరులో అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలను పుతిన్‌ ప్రభావితం చేయాలని చూశారని ఓ రహస్య నివేదిక అమెరికాలో వెలుగులోకి వచ్చింది. నాటి అధ్యక్షుడు ట్రంప్‌నకు అనుకూలంగా పావులు కదిపారని నివేదిక పేర్కొంది. దీనిపై స్పందించిన బైడెన్‌ ‘కిల్లర్ పుతిన్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని వ్యాఖ్యానించారు.

 దీనిపై రష్యా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఓ దేశాధినేతపై ఇలాంటి పదజాలం ప్రయోగించడం సబబు కాదని తెలిపింది. అమెరికాలో ఉన్న తమ రాయబారిని పిలుపించుకొని ఈ వ్యవహారంపై చర్చిస్తామని తెలిపింది. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న సంబంధాలు మరింత దిగజారకుండా ఉండేందుకు ఇరు పక్షాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

More Telugu News