Roja: వైసీపీ నేతలే వెన్నుపోటు పొడుస్తున్నారు: రోజా 

Few YSRCP leaders are backstabbing the party says Roja
  • కొందరు వైసీపీ నేతలు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు
  • వైసీపీ అభ్యర్థులపై రెబెల్ అభ్యర్థులను బరిలోకి దించారు
  • ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్తా
తమ సొంత పార్టీలోనే వెన్నుపోటు పొడుస్తున్న నాయకులు ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలు వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రెబల్ నేతలు కొందరు పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని... ఇదే సమయంలో మీడియా ముందుకు వచ్చి తమ రక్తంలో వైసీపీ రక్తం ఉందని చెపుతున్నారని అన్నారు. వారి ద్వంద్వ వైఖరి తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నగరిలో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ ఆరోపణలు చేశారు.

కొందరు వైసీపీ నేతలు తమ అనుచరులను నగరి, పుత్తూరుల్లో రెబెల్ అభ్యర్థులుగా బరిలోకి దించారని... అసలైన వైసీపీ అభ్యర్థులను ఓడించాలని చూశారని రోజా మండిపడ్డారు. ఈ విషయాన్ని తమ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఎలాంటి ఘన విజయాన్ని సాధించిందో... మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ సుపరిపాలనకు ప్రజలు పట్టం కడుతున్నారని చెప్పారు.
Roja
YSRCP
Rebel Leaders
Jagan
Nagari

More Telugu News