Karnataka: రాసలీలల కేసు.. బలిపశువును చేశారంటూ కర్ణాటక మాజీ మంత్రి కంటతడి

Top leader framed me says Ramesh Jarkiholi
  • నాలుగు నెలల క్రితమే నాపై కుట్ర
  • సీడీలో కనిపించిన యువతికి రూ. 5 కోట్లు, విదేశాల్లో రెండు ఫ్లాట్‌లు ఇచ్చారు
  • పదవి పోవడం కంటే నిందలు భరించడమే కష్టంగా ఉంది
  • ఏ ఒక్కరినీ వదలబోను, అందరినీ జైలుకు పంపిస్తా
రాసలీలల ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా చేసిన కర్ణాటక బీజేపీ నేత రమేశ్ జార్కిహోళి తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన ఆయన తనకు ఏ పాపమూ తెలియదని, తనను బలిపశువును చేశారని కన్నీరు పెట్టుకున్నారు. తనను ఇబ్బందుల పాలు చేసేందుకు విపక్షాలే ఈ వల పన్నాయని, దీని నుంచి తాను నిర్దోషిగా బయటపడతానని ధీమా వ్యక్తం చేశారు.

నకిలీ సీడీ సృష్టించి తన పరువుకు భంగం కలిగించిన వారిని ఊరకనే వదలబోనని, వారిపై కేసు పెట్టి జైలుకు పంపిస్తానని రమేశ్ జార్కిహోళి శపథం చేశారు. తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడు నెలలు కూడా పదవిలో ఉండవంటూ ఓ నాయకుడు తనకు సవాల్ విసిరారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

సీడీలో కనిపించిన యువతికి రూ. 50 లక్షలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోందని, నిజానికి ఆమెకు రూ. 5 కోట్లతోపాటు విదేశాల్లో రెండు ఫ్లాట్లు కూడా ఇచ్చినట్టు తన వద్ద సమాచారం ఉందన్నారు. తనకు మంత్రి పదవి కంటే పరువు, మర్యాదలే ముఖ్యమన్నారు. ఏడాదిలోనే పదవికి దూరమయ్యానన్న బాధకంటే నిందలు భరించడమే కష్టంగా ఉందన్నారు.

బాధలో ఉన్న తనకు ముఖ్యమంత్రి యడియూరప్ప, మాజీ సీఎం కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్ణ ధైర్యం నింపారంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. యశ్వంతపుర పోలీస్ స్టేషన్ పక్కనున్న భవనంలోని నాలుగో అంతస్తులోని ఫ్లాట్‌లో తనపై కుట్రకు పథక రచన జరిగిందని, ఇందుకోసం రూ. 20 కోట్లు ఖర్చు చేసినట్టు నాలుగు నెలల క్రితమే తనకు సమాచారం అందిందని రమేశ్ పేర్కొన్నారు.
Karnataka
Ramesh Jarkiholi
Sex CD

More Telugu News