Petrol: రోజువారీ సమీక్షలుండవ్​.. పెట్రోల్​, డీజిల్​ ధరలపై కేంద్రం దిద్దుబాటు చర్యలు!

Finance ministry considers cutting taxes on petrol and diesel
  • ధరలను స్థిరీకరించేందుకు ఉపక్రమించిన సర్కారు
  • ఎక్సైజ్ డ్యూటీ తగ్గించేందుకు ఆర్థిక శాఖ ప్రతిపాదనలు
  • మార్చి రెండో పక్షం నాటికి ధరల కట్టడికి కసరత్తులు
  • వివిధ రాష్ట్రాలు, చమురు సంస్థలు, పెట్రోలియం శాఖతో సంప్రదింపులు
పెట్రోల్, గ్యాస్ ధరలు సామాన్యుడికి గుదిబండలా మారాయి. కొన్ని రోజులుగా ధరలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడమన్నది లేదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ సెంచరీ కొట్టేసింది. ధరల పెరుగుదలపై జనాలు గుర్రుగా ఉన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. చమురుపై ఉన్న పన్నులు తగ్గించి సామాన్యులపై పడుతున్న భారాన్ని తప్పించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తులు చేస్తున్నట్టు ముగ్గురు ప్రభుత్వ అధికారులు చెప్పుకొచ్చారు.

పది నెలలుగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయని, ఈ కాలంలో ముడి చమురు ధరలు రెట్టింపయ్యాయని ఆ అధికారులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వానికీ ఆదాయం లేకపోవడం, కరోనా ప్యాకేజీలకు భారీగా వెచ్చించడం వంటి కారణాలతో ఖజానాకు భారీగానే గండిపడిందని, అందుకే గత్యంతరం లేని పరిస్థితుల్లో పన్నులు పెంచాల్సి వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం చమురు రిటైల్ ధరలో పన్నుల వాటానే దాదాపు 60 శాతం దాకా ఉంది.

ఈ నేపథ్యంలోనే చమురుపై ఉన్న పన్నులను తగ్గించేందుకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, చమురు సంస్థలు, పెట్రోలియం శాఖతో ఆర్థిక శాఖ సంప్రదింపులు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు ఏ రూపంలో పన్నుల్లో కోత విధించాలన్న దానిపై చర్చిస్తున్నారని అంటున్నారు. ఈ నెల రెండో పక్షం నాటికి ధరలను తగ్గించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.

పన్నులను తగ్గించే ముందు ధరలను స్థిరీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముడి చమురు ధరలు పెరిగినా.. రోజువారీగా ధరలను సమీక్షించే పద్ధతిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు. ముడి చమురు ఉత్పత్తిలో కోతలు విధించొద్దని, దాని వల్ల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతోందని ఒపెక్ దేశాల సమాఖ్యను కోరినట్టు చెబుతున్నారు. ఒపెక్ నుంచి ఎలాంటి నిర్ణయం వచ్చినా ధరలను స్థిరీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అంటున్నారు.
Petrol
Diesel
Finance Ministry
Crude Oil Prices

More Telugu News