Chandrababu: ఎట్టకేలకు నిరసన విరమించిన చంద్రబాబు... హైదరాబాద్ పయనం

Chandrababu leaves Renigunta airport and off to Hyderabad
  • తిరుపతిలో ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు
  • ఎయిర్ పోర్టులో అడ్డుకున్న పోలీసులు
  • అక్కడే బైఠాయించిన చంద్రబాబు
  • 10 గంటల పాటు నిరసన
  • ఫలించిన అర్బన్ ఎస్పీ, జేసీ విజ్ఞప్తులు
తనను ధర్నాకు అనుమతించకపోవడంతో రేణిగుంట విమానాశ్రయంలోనే నేలపై బైఠాయించి నిరసన తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎట్టకేలకు హైదరాబాద్ పయనం అయ్యారు. ఈ మధ్యాహ్నం నుంచి ఆయనను హైదరాబాద్ తిప్పి పంపేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

ఈ మధ్యాహ్నం ఓసారి ఆయనను హైదరాబాదు పంపేందుకు పోలీసులు విమానంలో టికెట్లు కూడా బుక్ చేశారు. అయితే వీలుకాకపోవడంతో రాత్రికి మరోసారి టికెట్లు బుక్ చేశారు. ఈ పర్యాయం ఆయన రేణిగుంట ఎయిర్ పోర్టును వీడేందుకు అంగీకరించారు. దాంతో 10 గంటల పాటు ఎయిర్ పోర్టులోనే సాగిన నిరసన ముగిసింది. ఈ క్రమంలో చంద్రబాబుతో తిరుపతి అర్బన్ ఎస్పీ, జేసీ పలుమార్లు చర్చించారు.

చంద్రబాబు ఎయిర్ పోర్టులో నిరసన తెలుపున్నంత సేపు పోలీసు ఉన్నతాధికారులు అక్కడే ఉన్నారు. లాంజ్ లో నేలపై కూర్చున్న చంద్రబాబు సీరియస్ గా ఫోన్ చూసుకుంటుండగా, చంద్రబాబునే చూస్తూ పోలీసు అధికారులు నిల్చుని ఉండడం పలు వీడియోల్లో దర్శనమిచ్చింది. మధ్యమధ్యలో వారు ఆయనను వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేయడం, ఆయన ససేమిరా అనడం కూడా కనిపించింది.
Chandrababu
Renigunta
Airport
Hyderabad
Telugudesam

More Telugu News