Harish Rao: ఇప్పటికే ఈటల పని అయిపోయింది.. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత హరీశ్ రావు పని అయిపోతుంది: రేవంత్ రెడ్డి

Revanth Reddy comments on KTR and Harish Rao
  • దుబ్బాక ఎన్నికల్లో హరీశ్ కి సగం చీటీ చినిగింది
  • ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మొత్తం చీటీ చించేస్తారు
  • దాసోజు శ్రవణ్ మీదకు దున్నపోతులను కేటీఆర్ ఉసిగొల్పారు
టీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఎన్నికల్లో హరీశ్ కి  సగం చీటీ చినిగిపోయిందని... చీటీ మొత్తాన్ని చించడానికే ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను హరీశ్ కి అప్పగించారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే మంత్రి ఈటల పని అయిపోయిందని... ఎన్నికల తర్వాత హరీశ్ పని అయిపోతుందని అన్నారు.

ఉద్యోగాల భర్తీపై చర్చకు రాకుండా ఓ విద్యావేత్తను కేటీఆర్ తిట్టించారని రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి ఒక విద్యావేత్త అని, రాములు నాయక్ సామాజికవేత్త అని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం విద్యా వ్యాపారవేత్తలని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ మీదకు దున్నపోతులను కేటీఆర్ ఉసిగొల్పారని విమర్శించారు. ఉద్యోగ నియామకాలపై మీడియా సమక్షంలో చర్చించేందుకు ఎవరు వచ్చినా చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. ఉద్యోగాలు ఇచ్చినప్పుడు... ఆ విషయాన్ని చెప్పుకునేందుకు రావడానికి ఏం ఇబ్బంది? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఎన్నికల కోసమే ఉద్యోగాల గురించి టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
Harish Rao
Etela Rajender
KTR
TRS
Revanth Reddy
Congress

More Telugu News