Gulam Nabi Azad: ప్రధాని మోదీని కొనియాడిన కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్

Congress senior leader Gulam Nabi Azad praises PM Modi
  • జమ్మూలో ఓ సభలో ప్రసంగించిన గులాంనబీ ఆజాద్
  • మోదీ వ్యక్తిత్వాన్ని దాచుకోడని కితాబు
  • పల్లెటూరి నుంచి వచ్చాడని వెల్లడి
  • మోదీ టీ కూడా అమ్మాడని వివరణ
ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ నేతలు ప్రశంసించడం అనేది చాలా అరుదైన విషయం. తాజాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ ఆజాద్ ప్రధాని మోదీని ప్రశంసించారు. జమ్మూలో ఓ సభలో ప్రసంగిస్తూ, తన నేపథ్యాన్ని దాచుకోవాలని మోదీ ఎప్పుడూ ప్రయత్నించలేదని అన్నారు. అనేకమంది నేతలకు సంబంధించిన పలు అంశాలను తాను ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందించానని తెలిపారు.

తాను పల్లెటూరి నుంచి వచ్చానని, అందుకు గర్విస్తుంటానని ఆజాద్ పేర్కొన్నారు. మన ప్రధాని మోదీ కూడా గ్రామం నుంచే వచ్చారని, ఆయన టీ కూడా అమ్మేవారని వివరించారు. తాము రాజకీయ ప్రత్యర్థులమే కావొచ్చు కానీ, తన వ్యక్తిత్వాన్ని దాచుకోని వ్యక్తిగా ప్రధాని మోదీని అభినందించకుండా ఉండలేనని ఆజాద్ స్పష్టం చేశారు. కొందరు గిరిగీసుకుని అందులోనే బతుకుతుంటారని, తమ వాస్తవిక వ్యక్తిత్వాన్ని దాచుకుంటారని వివరించారు.

కాగా, గత నెలలో ఆజాద్ రాజ్యసభ సభ్యత్వం పూర్తవుతున్న సందర్భంగా పార్లమెంటులో ప్రధాని మోదీ ఆయనను కొనియాడుతూ... గులాంనబీ ఆజాద్ ను నిజమైన స్నేహితుడిగా అభివర్ణించారు. ఆయనను తాను రిటైర్ కానివ్వబోనని, ఆయన కోసం తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని మోదీ వ్యాఖ్యానించారు.
Gulam Nabi Azad
Narendra Modi
True Self
Congress
BJP

More Telugu News