Grandhi Srinivas: మత్స్యపురి ఘటన నేపథ్యంలో పవన్ కల్యాణ్ పై విరుచుకుపడిన భీమవరం ఎమ్మెల్యే

YCP MLA Grandhi Srinivas slams Janasena Chief Pawan Kalyan
  • మత్స్యపురి సర్పంచ్ గా జనసేన మద్దతుదారు విజయం
  • విజయోత్సవ ర్యాలీలో జనసేన, వైసీపీ మధ్య ఘర్షణలు
  • పవన్ ఎలాంటి మార్పు కోరుకుంటున్నాడన్న గ్రంథి శ్రీనివాస్
  • కార్యకర్తలను ప్రజలపైకి ఉసిగొల్పుతున్నాడని వ్యాఖ్యలు
పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యపురి పంచాయతీ పరిధిలో జనసేన, వైసీపీ మధ్య ఘర్షణ నెలకొంది. ఇక్కడ సర్పంచ్ గా జనసేన బలపర్చిన కారేపల్లి శాంతిప్రియ గెలుపొందారు. అయితే విజయోత్సవ ర్యాలీలో జనసేన కార్యకర్తలు కాల్చిన బాణసంచా ఓ మహిళ చీరకొంగుకు అంటుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. దీని సందర్భంగా ఘర్షణలు నెలకొన్నాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్పందించారు.

పవన్ కల్యాణ్ ఏ మార్పును కోరుకుంటున్నాడో రాష్ట్ర ప్రజలు గమనించాలని అన్నారు. మీ సంగతి చూస్తానని, మెడ మీద తలకాయలు ఉండవని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. జనసైనికులు, జన మహిళలు అంటూ పేర్లు పెట్టి వారిని ప్రజలపైకి ఉసిగొల్పుతున్నాడని... పార్టీ శ్రేణులను సంఘవ్యతిరేక శక్తులుగా తయారుచేస్తున్నాడని గ్రంథి శ్రీనివాస్ విమర్శించారు.

1983లో ఎన్టీఆర్ పార్టీ రంగప్రవేశం చేసిన సమయంలో ఇలాంటి అరాచక పరిస్థితులు కనిపించాయని, మళ్లీ ఇవాళ జనసేన పార్టీ కారణంగా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని అన్నారు. తన పార్టీ కార్యకర్తలు బైకులకు సైలెన్సర్లు తీసేసి తిరిగితే తప్పేం లేదంటున్నాడని, కుర్రాళ్లు అలా తిరిగితే తప్పేముంది? అంటూ ప్రోత్సహిస్తున్నాడని విమర్శించారు.

"పవన్ ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు? ఎన్నికల సంఘం అనుమతులు లేకుండానే ర్యాలీ నిర్వహించారు. ప్రతి వైసీపీ కార్యకర్త ఇంటికి టపాసులు కట్టి కాల్చడమే కాకుండా వారిని భయభ్రాంతులకు గురిచేశారు. అంతేకాదు, దళితవాడలోనూ జనసైనికులు విధ్వంసం సృష్టించారు. ఓ మహిళపై దాడికి దిగారు" అని వివరించారు.
Grandhi Srinivas
Pawan Kalyan
Mathsyapuri
Gram Panchayat
Janasena
YSRCP
West Godavari District

More Telugu News