Airlines: లగేజ్​ లేకుంటే.. విమాన చార్జీల్లో డిస్కౌంట్​!

Flyers can opt in for no baggage travel in Airlines
  • టికెట్ తీసుకునేటప్పుడే ‘నో బ్యాగేజ్’ ఆప్షన్
  • ప్రయాణికులకు ఊరటనిచ్చిన డీజీసీఏ
  • సీటునూ ఎంపిక చేసుకునే వెసులుబాటు
  • చిరుతిళ్లు, డ్రింక్స్, ఇతర అనవసర ఖర్చులకూ చెల్లు
  • డొమెస్టిక్ విమాన ప్రయాణాలకే కొత్త నిబంధనలు
చాలా సందర్భాల్లో విమాన ప్రయాణాల్లో అనవసర చార్జీలే ఎక్కువగా ఉంటున్నాయి. బ్యాగేజీ లేకపోయినా చార్జీలు బాదుతూనే ఉన్నారు. అవసరం లేకపోయినా చిరుతిళ్లు, డ్రింక్స్, మీల్స్, లాంజ్ సర్వీసెస్ వంటి వాటి ద్వారా కూడా అదనంగా భారం పడుతోంది. దీనిపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పందించింది. ప్రయాణికులకు ‘నో బ్యాగేజ్’ లేదా ‘ఓన్లీ క్యాబిన్ బ్యాగేజ్’ సౌకర్యం కల్పించింది.

పాత నిబంధనల ప్రకారం క్యాబిన్ బ్యాగేజీ 7 కిలోలు, చెకిన్ బ్యాగేజీ 15 కిలోల వరకు ఉండొచ్చు. అది దాటితే చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేవలం క్యాబిన్ లగేజీ లేదా అసలు లగేజీ లేకుండా ప్రయాణించే వారికి టికెట్లను తక్కువ ధరకు ఇచ్చే ఉద్దేశంతో డీజీసీఏ ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. టికెట్ బుక్ చేసుకునే టైంలోనే లగేజీ బరువును వెల్లడిస్తే టికెట్ ధరలో డిస్కౌంట్ ఇస్తారు.

అయితే, కేవలం డొమెస్టిక్ విమానాల్లోనే ఈ వెసులుబాటును కల్పించనున్నారు. టికెట్ బుకింగ్ టైంలో జీరో/క్యాబిన్ బ్యాగేజీని ఎంచుకుని, ప్రయాణ సమయంలో ఎక్కువ లగేజీని తెస్తే మాత్రం విమానయాన సంస్థల ధరలకు తగ్గట్టు చార్జీలు వసూలు చేస్తారని ప్రకటించింది. దాంతో పాటు సీటును ఎంపిక చేసుకునే వెసులుబాటునూ కల్పించింది. మీల్–స్నాక్స్–డ్రింక్స్ చార్జీలు, ఎయిర్ లైన్ లాంజ్ సర్వీస్, క్రీడా పరికరాలు, సంగీత పరికరాల చార్జీలనూ టికెట్ ధరల నుంచి మినహాయించుకోవచ్చు.

వీటితో చాలా మందికి అవసరం లేదని, చార్జీల ధరల నుంచి వాటిని మినహాయించాలని పలువురు ప్రయాణికులు కోరడంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ అవీ కావాలనుకునే వారు ప్రత్యేకంగా వాటిని ఎంచుకోవచ్చని డీజీసీఏ పేర్కొంది.
Airlines
DGCA
No Baggage Fare

More Telugu News