Mumbai: కరోనా కలకలం.. ముంబైలో 1,305 బిల్డింగులకు సీల్!

More than 70000 households affected after BMC seals 1305 buildings in Mumbai
  • ముంబైలో కొత్తగా 2,749 కరోనా కేసులు
  • కోవిడ్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్న బీఎంసీ
  • హోం క్వారంటైన్ లో ఉన్న వారి చేతులపై స్టాంపింగ్
కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులతో మహారాష్ట్రలో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ముంబైలో కూడా కొత్త కేసులు కలకలం రేపుతున్నాయి. ముంబైలో కొత్తగా 2,749 కేసులు నమోదు కావడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అలర్ట్ అయింది. కోవిడ్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. నగరంలోని 1,305 బిల్డింగులను అధికారులు మూసేశారు. అధికారులు సీల్ చేసిన బిల్డింగుల్లో 71,838 కుటుంబాలు నివసిస్తున్నాయి. కరోనా కేసులు బయటపడ్డ ఈ బిల్డింగుల నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీఎంసీ సరికొత్త నిబంధనలను జారీ చేసింది. ఏ రెసిడెన్సియల్ బిల్డింగ్ లోనైనా ఐదుకు మించి యాక్టివ్ కేసులు ఉంటే... ఆ భవనాన్ని సీల్ చేస్తారు. విదేశాల నుంచి ముంబైకి వచ్చేవారు కచ్చితంగా ఏడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారి చేతులపై స్టాంప్ వేస్తారు. వివాహాలు జరుగుతున్న వేదికలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అనే విషయాలను చెక్ చేస్తున్నారు. 50 మందికి మించి పెళ్లిళ్లకు హాజరు కాకూడదు. రెస్టారెంట్లు కూడా 50 శాతం కెపాసిటీతో మాత్రమే పని చేయాలి.

మరోవైపు గత 24 గంటల్లో మహారాష్ట్ర వ్యాప్తంగా 6,112 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 44,765 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 20,87,632కి చేరింది. 51,713 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ ప్రభావం మళ్లీ పెరుగుతుండటంతో మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు ధరించడం వంటి వాటిని కచ్చితంగా పాటించేలా చేసేందుకు ప్రభుత్వం మార్షల్స్ ను నియమించింది.
Mumbai
Corona Virus

More Telugu News