వైఎస్ కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని చూసిన పెద్దమనుషులే ఇవాళ రేవంత్ కు అడ్డుతగులుతున్నారు: కొండా సురేఖ

Konda Surekha fires on Congress seniors
  • రావిరాలలో రాజీవ్ రైతు రణభేరి సభ 
  • ప్రతి ఒక్కరూ రేవంత్ కు మద్దతివ్వాలని సురేఖ పిలుపు
  • రేవంత్ రెడ్డి మాస్ లీడర్ అంటూ కితాబు
  • కేసీఆర్ కు ఇలాంటి మాస్ లీడరే సరైనవాడు అంటూ వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేపట్టిన రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర ముగింపు నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా రావిరాలలో రాజీవ్ రైతు రణభేరి సభ జరిగింది. ఈ సభకు హాజరైన మహిళా నేత కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లపై ధ్వజమెత్తారు.

నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అడ్డుతగిలినవాళ్లే ఇవాళ రేవంత్ రెడ్డికి కూడా అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. గతంలో రైతు సమస్యలపై వైఎస్సార్ పాదయాత్రకు కూడా అనుమతి లేదన్నారని, ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని చూశారని అన్నారు. ఆ పెద్దమనుషులే ఈరోజు కూడా మాట్లాడుతున్నారని కొండా సురేఖ విమర్శించారు.

నాడు వైఎస్ ను ఆపాలని వారు భావించినప్పుడు వైఎస్ భయపడలేదని, కాంగ్రెస్ కోసం నడిచారని, టీడీపీని గద్దె దించి రైతాంగాన్ని ఆదుకున్నారని వెల్లడించారు. ఇప్పుడు రైతుల కోసం పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డికి మనుషులు అనే ప్రతి ఒక్కరూ మద్దతు పలకాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉత్తమ్ కుమార్ క్లాస్ లీడర్ అయితే, రేవంత్ రెడ్డి మాస్ లీడర్ అని కొండా సురేఖ అభివర్ణించారు. సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి వంటి మాస్ లీడరే సరైనవాడు అని  అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Konda Surekha
Congress
YSR
Revanth Reddy
Rajeev Rythu Ranabheri

More Telugu News