Disha Ravi: గ్రెటా టూల్ కిట్ కేసులో బెంగళూరు యువతి అరెస్ట్

Climate activist Disha Ravi arrested in connection with Greta Thunberg tool kit case
  • ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల అదుపులో 21 ఏళ్ల దిశ రవి
  • టూల్ కిట్ ను ఎడిట్ చేసినట్టు ఒప్పుకొందన్న పోలీసులు
  • ఫ్రైడే ఫర్ ఫ్యూచర్ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న దిశ
పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్ బర్గ్ షేర్ చేసిన టూల్ కిట్ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల యువతిని అరెస్ట్ చేశారు. బెంగళూరులోని సోలదేవనహల్లికి చెందిన దిశ రవి అనే పర్యావరణ కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు. ఫ్రైడే ఫర్ ఫ్యూచర్ అనే స్వచ్ఛంద వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆమెను.. తన ఇంట్లో అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

గ్రెటా పోస్ట్ చేసిన టూల్ కిట్ ను ఎడిట్ చేసి తదుపరి పోస్ట్ చేశానని ఆమె ఒప్పుకున్నట్టు స్పెషల్ సెల్ పోలీసులు చెబుతున్నారు. కాగా, మౌంట్ కార్మెల్ విమెన్ కాలేజీలో ఆమె చదువుతోంది. గ్రెటా థన్ బర్గ్ పర్యావరణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన 2018 ఆగస్టు నుంచి.. ఆమె కూడా ఇక్కడ ఉద్యమాలు చేస్తోంది. అందులో భాగంగానే ఫ్రైడే ఫర్ ఫ్యూచర్ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది.

సాగు చట్టాల రద్దు డిమాండ్ తో చేస్తున్న రైతుల ఉద్యమానికి ఇటీవల గ్రెటా థన్బర్గ్ కూడా మద్దతు తెలిపింది. ఓ టూల్ కిట్ ను షేర్ చేసింది. ఖలిస్థానీ గ్రూప్ అయిన పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ తయారు చేసిందని, ఆ టూల్ కిట్ వల్లే జనవరి 26న హింస జరిగిందని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. గ్రెటాపైనా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరుకు చెందిన దిశనూ అరెస్ట్ చేశారు.
Disha Ravi
Greta Thunberg
Tool Kit
Farm Laws

More Telugu News