Corona Virus: టీకా తీసుకున్న తరువాత ఈ మూడు సైడ్ ఎఫెక్ట్ లు వస్తే పని చేసినట్టు!

These 3 Side Effects are Common After Corona Vaccine
  • కండరాల నొప్పి, జ్వరం, తలనొప్పి
  • శరీరంలో టీకా పని చేస్తున్నట్టే లెక్క
  • యూఎస్ సీడీసీ చీఫ్ ఆంటోనీ ఫౌసీ
ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో కరోనా వ్యాక్సిన్ ను ప్రజలకు ఇస్తున్నారు. టీకా తీసుకున్న వారిలో అత్యధికులు బాగానే ఉన్నా, అతి కొద్దిమందికి మాత్రం స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్ లు వస్తున్నాయి. కొంతమంది టీకా తీసుకున్న తరువాత చనిపోయారని వార్తలు వచ్చినా, వారి మరణానికి, టీకాకు సంబంధం లేదని వైద్య ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యూఎస్ సీడీసీ చీఫ్ డాక్టర్ ఆంటోనీ ఫౌసీ కీలక ప్రకటన చేశారు.

టీకా తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్ లు వస్తేనే టీకా సమర్ధవంతంగా పనిచేసినట్టుగా భావించవచ్చని అన్నారు. ఏవైనా ప్రభావాలు కనిపిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అన్ని రకాల సైడ్ ఎఫెక్ట్ లూ ప్రాణాంతకమేమీ కాదని, అది వ్యాక్సిన్ శరీరంలో పని చేస్తోందనడానికి సంకేతమని స్పష్టం చేశారు. ఏ వ్యాధికి టీకాను తీసుకున్నా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్ లు సర్వసాధారణమని చెప్పిన ఆయన, ఇవి ఎటువంటివైనా రెండు నుంచి మూడు రోజుల్లోనే సమసిపోతాయని వెల్లడించారు.

కరోనా టీకాను తీసుకున్న తరువాత శరీరంలో ఉండే సాధారణ రోగ నిరోధక శక్తి స్పందిస్తుందని, దీని ప్రభావంతో శరీరానికి నొప్పులు, స్వల్పంగా జ్వరం, జలుబు వంటివి రావచ్చని ఆయన అన్నారు. ముఖ్యంగా కండరాల నొప్పులు, తలనొప్పి రావడం, నీరసంగా అనిపించడం సంభవిస్తే, వ్యాక్సిన్ ప్రభావం శరీరంపై చూపిస్తున్నట్టుగానే భావించాలని, ఇవేవీ ఇబ్బంది పెట్టేంతగా ఉండబోవని ఆయన అన్నారు.

ప్రజలకు ఇప్పటివరకూ అందుబాటులోకి వచ్చిన అన్ని టీకాలూ కరోనా వైరస్ పై పని చేస్తున్నాయని, వీటిల్లో అత్యంత సమర్థవంతంగా పనిచేసే టీకా ఏంటన్న విషయం తేలాలంటే సమయం పడుతుందని డాక్టర్ ఆంటోనీ ఫౌసీ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో టీకా తీసుకునే సమయానికే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. టీకా తీసుకున్న తరువాత జ్వరం వచ్చి, ఐదు రోజులైనా తగ్గకపోయినా, జీర్ణ సమస్యలు రోజుల తరబడి కొనసాగుతున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
Corona Virus
Vaccione
Side Effects
Dr Antoney Fausi

More Telugu News