Team India: మన బౌలర్లు బౌండరీలిస్తే.. నాపై రవిశాస్త్రి అరిచేసేవాడు: బౌలింగ్​ కోచ్​ భరత్​ అరుణ్

Ravi Shastri shouts in the dressing room if someone concedes 2 boundaries says Bharat Arun
  • ఆ కోపం తనపైనే చూపించే వాడని వెల్లడి
  • బౌలర్లకు వికెట్లపైనే శ్రద్ధ ఉండాలనేవారు
  • మన బ్యాట్స్ మెన్ పరుగులు రాబట్టాలనేవారు
  • రహానే ప్రశాంతం.. కోహ్లీకి కోపమన్న బౌలింగ్ కోచ్
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ను ఒడిసిపట్టేసి చరిత్ర సృష్టించింది భారత్. అనుభవం లేని ఆటగాళ్లతో ఫీల్డ్ లో టీమిండియా చూపించిన దృఢచిత్తంతో ప్రతిఫలం దక్కింది. అయితే, ఆట సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లో పరిస్థితి ఎలా ఉండేదో.. కోచ్ రవిశాస్త్రి ఏమనేవారో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వివరించారు. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తో సరదా ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

బౌలర్లు ఎవరైనా బౌండరీలు ఇస్తే.. డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న రవిశాస్త్రి మహా కోపం ప్రదర్శించేవారని చెప్పారు. తనపైనే ఆ కోపాన్ని చూపించేవారని, బౌండరీ వచ్చినప్పుడల్లా తనపై అరిచేవారని అన్నారు. బౌలర్లు బౌండరీలు ఇవ్వడం రవిశాస్త్రికి అస్సలు నచ్చేది కాదన్నారు.

‘‘బౌలింగ్ చేస్తే వికెట్లు రాబట్టడంపైనే దృష్టి పెట్టాలని కోచ్ రవిశాస్త్రి ఎప్పుడూ చెబుతుంటారు. ప్రత్యర్థి బౌలింగ్ చేసేటప్పుడు.. మనం పరుగులు సాధించాలని అంటారు. మన బౌలర్ బౌండరీ ఇచ్చాడంటే అంతే.. నా మీద అరుపులు తప్పవని ఫిక్స్ అయిపోయేవాడిని’’ అని చెప్పుకొచ్చారు.  

విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేల మధ్య కెప్టెన్సీ తేడాల గురించీ ఆయన వివరించారు. రహానే చాలా ప్రశాంతంగా ఉంటాడని, అందుకే బౌలర్లు తాము తప్పులు చేసినా పెద్దగా భయపడేవారు కాదని అన్నారు. అయితే, బయటకు ప్రశాంతంగానే కనిపించినా.. అతడి లోపల మాత్రం టెన్షన్ విపరీతంగానే ఉంటుందన్నారు. బౌలర్ తప్పు చేసినా సర్ది చెప్తాడన్నారు.

అందుకు కోహ్లీ పూర్తి భిన్నమన్నారు. రెండు చెడ్డ బంతులు పడితే.. కోహ్లీకి కోపం వస్తుందన్న భయం బౌలర్లలో ఉండేదని చెప్పారు. అయితే, అది కేవలం కోహ్లీ ఎనర్జీయేనని భరత్ అరుణ్ చెప్పుకొచ్చారు.
Team India
Bharat Arun
Ravi Shastri
Virat Kohli
Ajinkya Rahane

More Telugu News