Bandi Sanjay: కేటీఆర్ కోసం కేసీఆర్ దోష నివారణ పూజలు నిర్వహించారు: బండి సంజయ్

KCR performed pooja for KTR says Bandi Sanjay
  • పూజ సామగ్రిని త్రివేణి  సంగమంలో కలిపేందుకే కాళేశ్వరానికి వెళ్లారు
  • ఉద్యమ ద్రోహులే కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారు
  • ఇప్పటికైనా దళితుడిని సీఎం చేయాలి
కుమారుడు కేటీఆర్ ని సీఎం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాంహౌస్ లో మూడు రోజుల పాటు దోష నివారణ పూజలు నిర్వహించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఉపయోగించిన పూజ సామగ్రిని త్రివేణి సంగమంలో కలిపేందుకే కుటుంబ సమేతంగా కేసీఆర్ కాళేశ్వరానికి వెళ్లారని అన్నారు. కాళేశ్వరంలో కేసీఆర్ దంపతులు ఏం కలిపారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మూడో టీఎంసీ అంటూ ప్రజలను కేసీఆర్ మభ్యపెడుతున్నారని... మూడో టీఎంసీతో వచ్చే లాభమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఉద్యమ ద్రోహులు మాత్రమే కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని... కేటీఆర్ సీఎం కావడం నిజమైన ఉద్యమకారులకు ఇష్టం లేదని సంజయ్ అన్నారు. మంత్రి ఈటలకు టీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పారు. ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చినప్పుడల్లా ఈటలను ముందు పెట్టి కేసీఆర్ బయటపడుతున్నారని దుయ్యబట్టారు.

కేటీఆర్ సీఎం అయినా, కాకపోయినా తమకు ఒకటేనని సంజయ్ చెప్పారు. కేటీఆర్ సీఎం కావడాన్ని ఇష్టపడని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తే బీజేపీలో చేర్చుకుంటామని... అయితే వారికి అవినీతి మరకలు ఉండకూడదని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పారని... ఇప్పటికైనా ఆ పని చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూడా దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ చేసే పూజలన్నీ ఆయన కుటుంబ బాగుకోసమేనని... తాము చేసే పూజలు సమాజ హితం కోసమని అన్నారు.
Bandi Sanjay
BJP
KCR
KTR
TRS

More Telugu News