Uttam Kumar Reddy: ఢిల్లీలో ఏఐసీసీ నేత‌ల‌తో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చ‌ర్చ‌లు.. ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసే అవ‌కాశం

uttam meets aicc in delhi
  • రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు త్వ‌ర‌లో ఎన్నికలు
  • అభ్యర్థుల జాబితా ఏఐసీసీకి అంద‌జేత‌
  • మూడు రోజుల్లో ఖ‌రారు చేసే అవ‌కాశం
తెలంగాణ‌లోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు త్వ‌ర‌లో ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. గ‌తంలో తెలంగాణ‌లో జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించడంలో చాలా ఆలస్యం చేసింద‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి మాత్రం అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ‌ను చేప‌ట్టింది.

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు వరంగల్‌-నల్గొండ-ఖమ్మం స్థానం నుంచి పోటీ చేసేందుకు ప‌లువురు  కాంగ్రెస్  పార్టీ నేత‌లు పోటీ ప‌డుతున్నారు. ప్రధాన అభ్యర్థులతో ప్రాథమికంగా గుర్తించిన జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నిన్న ఢిల్లీలో‌ ఏఐసీసీ పెద్ద‌ల‌కు ఇచ్చారు. ఈ జాబితాపై నేడు ఆయ‌న‌ వారితో చర్చించనున్నారు.

మూడు రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ అభ్యర్థిత్వాలపై ఏఐసీసీ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి  ఏఐసీసీ కార్యదర్శులు జి.చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, ఎస్‌ఎ సంపత్‌కుమార్‌, హర్షవర్ధన్‌రెడ్డి రేసులో ఉన్నట్లు తెలిసింది.

అలాగే, వరంగల్‌-నల్గొండ-ఖమ్మం స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, ఓయూ విద్యార్థి నాయకుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్‌, కాంగ్రెస్‌లో ఆదివాసీ విభాగం జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్‌లు ప్ర‌ధానంగా పోటీ ప‌డుతున్నారు.  

వరంగల్‌-నల్గొండ-ఖమ్మం స్థానంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెస‌ర్ కోదండరాం పోటీ చేయ‌నున్న విష‌యం తెలిసిందే. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ బ‌రిలో నిల‌వ‌నున్నారు. ఇత‌ర పార్టీలు కూడా త‌మ అభ్య‌ర్థుల ఎంపికపై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాయి. ప‌లు పార్టీలు ఇప్ప‌టికే నామ‌మాత్రంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నాయి.
Uttam Kumar Reddy
Congress
Telangana

More Telugu News