Turkey: టర్కీ కోర్టు సంచలన తీర్పు.. మతబోధకుడికి వెయ్యేళ్ల జైలు శిక్ష

Turkish religious cult leader Adnan Oktar jailed for 1075 years for sex crimes
  • పది కేసుల్లో దోషిగా తేలిన అద్నన్ ఒక్తర్
  • 1,075 సంవత్సరాల, 3 నెలల జైలు శిక్ష
  • 300కుపైగా పుస్తకాలు రాసి, 73 పుస్తకాలను అనువదించిన అద్నన్
  • తనను ఇరికించారంటూ ఆవేదన
మైనర్లపై లైంగిక దాడులు, ఆర్మీ గూఢచర్యం, బ్లాక్‌మెయిలింగ్ వంటి కేసుల్లో దోషిగా తేలిన టర్కీకి చెందిన వివాదాస్పద ముస్లిం మత బోధకుడు అద్నన్ ఒక్తర్‌కు కోర్టు 1,075 సంవత్సరాల శిక్ష విధించింది. ఒక్తర్ గతంలో ‘ఎ9’ అనే చానల్ ఏర్పాటు చేసి అందులో మత బోధనలు చేస్తూ పాప్యులర్ అయ్యాడు. అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిల మధ్య కూర్చుని విలాసవంతంగా కనిపిస్తూ చర్చలు నిర్వహించేవాడు.

ఒకసారి అతడు మహిళలతో డ్యాన్స్ చేస్తూ పురుషులతో కలిసి పాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులోని మహిళలను పిల్లి కూనలు (కిటెన్స్) అని, పురుషులను తన సింహాలు (లయన్స్) అంటూ అభ్యంతరకర రీతిలో పేర్కొన్నాడు. దీంతో అతడి కార్యక్రమాలపై నిఘా పెట్టిన టర్కీ మీడియా వాచ్‌డాగ్ ఆ చానల్‌ను నిషేధించింది. జులై 2018న అద్నన్ ఇంటిపై దాడిచేసిన పోలీసులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు అద్నన్‌తోపాటు మరో 77 మందిని అరెస్ట్ చేశారు.

మైనర్లపై లైంగికదాడులు, అత్యాచారాలకు పాల్పడడం, నేరస్థులను ప్రోత్సహించడం, బ్లాక్‌మెయిలింగ్, గూఢచర్యం వంటి అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం మొత్తం 10 కేసుల్లో అతడిని దోషిగా తేల్చింది. అతడితోపాటు మరో 13 మందికి కఠిన కారాగార శిక్షలు విధించింది. అందరికీ కలిపి ఏకంగా 9,803 సంవత్సరాల ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఒక్క అద్నన్‌కే 1,075 సంవత్సరాల మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

కాగా, 64 ఏళ్ల అద్నన్ 300కు పైగా పుస్తకాలను రాశాడు. 73 పుస్తకాలను అనువదించాడు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన అద్నన్.. పథకం ప్రకారం కుట్ర చేసి తనను ఇరికించారని, కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తానని పేర్కొన్నాడు.
Turkey
Cult leader
Adnan Oktar
sex crimes

More Telugu News