Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అరెస్ట్!

AP BJP Chief Somu Veerraju Arrest
  • రామతీర్థం ఆలయంలో రాముని విగ్రహం ధ్వంసం
  • నేడు ధర్మయాత్రకు పిలుపునిచ్చిన బీజేపీ
  • పలువురు బీజేపీ నేతల గృహ నిర్బంధం
  • రామతీర్థం జంక్షన్ లో సోము వీర్రాజును నిలిపివేసిన పోలీసులు
విజయనగరం జిల్లా రామతీర్థంలోని దేవాలయంలో శ్రీరాముని విగ్రహ ధ్వంసానికి నిరసనగా, బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా తలపెట్టిన ధర్మయాత్ర, ఉద్రిక్త పరిస్థితులకు దారితీయగా, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. రామతీర్థం ప్రాంతంలో సెక్షన్ 30 అమలులో ఉందని, ఎటువంటి ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని వీర్రాజుకు స్పష్టం చేసిన పోలీసులు, ఆపై అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి, నెల్లిమర్ల పోలీసు స్టేషన్ కు ఆయన్ను తరలించారు.

అంతకుముందు పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి, వారు బయటకు రాకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినా, వీర్రాజు రామతీర్థం కూడలి వరకూ చేరుకోగా, పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ముందుకు వెళ్లనివ్వకపోవడంతో, బీజేపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట కూడా జరిగింది. వారందరినీ చెదరగొట్టిన పోలీసులు సోము వీర్రాజును అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల తీరుకు నిరసనగా కాసేపు రోడ్డుపై బైఠాయించిన సోము వీర్రాజు, తాము ధర్మయాత్రను ముందుగానే ప్రకటించామని, శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, జగన్ ప్రభుత్వం దాష్టీకాలు చేస్తోందని విమర్శలు గుప్పించారు. రామతీర్థం ఆలయాన్ని సందర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతలను అనుమతించిన పోలీసులు, తమనెందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచిన బీజేపీ, జనసేన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదిలావుండగా, విశాఖపట్నం బీజేపీ కార్యాలయాన్ని పోలీసులు దిగ్బంధం చేశారు. ధర్మయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ సీఎం రమేశ్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ లను కార్యాలయం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కార్యాలయం గేట్లను మూసివేసి, తాళాలు వేసిన పోలీసులు, నేతలను లోపలే నిర్బంధించారు.
Ramateertham
BJP
Somu Veerraju
Arrest
Andhra Pradesh

More Telugu News