Diabetic Rice: తెలంగాణ డయాబెటిక్ రైస్ కు ఇతర రాష్ట్రాల్లోనూ గిరాకీ

Telangana diabetic rice gets huge demand in other states
  • తెలంగాణలో ప్రాచుర్యం పొందిన సోనా వరి
  • సోనా బియ్యంలో ఔషధ గుణాలు!
  • ఇతర రాష్ట్రాల్లోనూ భారీగా సాగు
  • మార్కెట్లో కిలో రూ.100 నుంచి రూ.145 పలుకుతున్న వైనం
తెలంగాణ రైతులు పండించే సోనా రకం బియ్యానికి ఔషధ గుణాలున్నాయని భావిస్తుంటారు. ఈ బియ్యాన్నే డయాబెటిక్ రైస్ అంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ తరహా బియ్యం శ్రేష్టం అని చెబుతుంటారు. ఈ సోనా వరి రకాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు. కొన్నేళ్ల కిందట ఈ ప్రత్యేక వరి వంగడాలను రూపొందించగా, ఆపై దీన్ని రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు.

సోనా రకం బియ్యానికి ఉన్న విశిష్టతల దృష్ట్యా ఇతర రాష్ట్రాల్లోనూ దీన్ని సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, ఒడిశా, చత్తీస్ గఢ్ రైతులు కూడా సోనా సాగు చేస్తున్నారు. సోనా బియ్యంలో గ్లైసెమిక్ సూచీలు తక్కువ స్థాయిలో ఉంటాయని శాస్త్రీయపరమైన అధ్యయనాల్లో పేర్కొన్నారు. రుచికి రుచి, అధిక దిగుబడి ఉండడంతో దీనికి బాగా డిమాండ్ ఏర్పడిందని జయశంకర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ తెలిపారు.

ఈ బియ్యం నాణ్యత దృష్ట్యా అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్ పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ (అపెడా) కూడా ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేయాలని భావిస్తోంది. అయితే, ఈ బియ్యం మార్కెట్లో కిలో రూ.100 నుంచి రూ.145 వరకు ధర పలుకుతుండగా, రైతుకు ముడుతోంది మాత్రం రూ.40 నుంచి రూ.45 మాత్రమేనట. రైతులు కాస్త ఆలస్యమైనా సరైన సమయంలో సోనా వరి పంటను మార్కెటింగ్ చేసుకోగలిగితే మంచి గిట్టుబాటు ధరలు లభిస్తాయని అధికారులు అంటున్నారు.
Diabetic Rice
Telangana
Andhra Pradesh
Tamilnadu
Karnataka
Odisha
Rajasthan

More Telugu News