Nagarjuna: ఓటీటీ విడుదలకు మొగ్గు చూపుతున్న నాగార్జున సినిమా

Nagarjuna film to be streamed by Netflicks
  • అహిషోర్ దర్శకత్వంలో నాగార్జున 'వైల్డ్ డాగ్'
  • థియేటర్లకు ఎదురవుతున్న ఆక్యుపెన్సీ సమస్య
  • రూ.27 కోట్లు ఆఫర్ చేసి హక్కులు పొందిన నెట్ ఫ్లిక్స్
  • జనవరి 26న స్ట్రీమింగ్ చేయడానికి ప్లానింగ్  
లాక్ డౌన్ సమయంలో మరోదారి లేక చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫామ్ మీద విడుదల చేసేశారు. సినిమాను బట్టి ఆయా నిర్మాతలకు మంచి ఆఫర్లు కూడా వచ్చాయి. ఇప్పుడు థియేటర్లు తెరుచుకున్నప్పటికీ.. కొందరు తమ సినిమాలను ఓటీటీ ద్వారా రిలీజ్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలో అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం కూడా చేరుతోంది.

అహిషోర్ సోలమన్ దర్శకత్వంలో నాగార్జున 'వైల్డ్ డాగ్' చిత్రం చేశారు. ఇన్వెస్ట్ గేటివ్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇంతకుముందే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ రూ.27 కోట్లను ఆఫర్ చేసిందనీ, దాంతో నిర్మాతలు డిజిటల్ రిలీజ్ కి ఇచ్చేశారని తెలుస్తోంది. థియేటర్లు తెరుచుకున్నప్పటికీ, ఆక్యుపెన్సీ అంతగా ఉండడం లేదనీ, అందుకే రిస్క్ తగ్గించుకునే క్రమంలో చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ కి ఇచ్చేసినట్టు చెబుతున్నారు.

కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగార్జున ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో కనిపిస్తారు. ఇందులో దియా మీర్జా, సయామీ ఖేర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 26న ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ విడుదల చేయనున్నట్టు సమాచారం.
Nagarjuna
Wild Dog
OTT
Netflicks

More Telugu News