సీఎం హోదాలో తిరుమల వెళ్లే వ్యక్తి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు: జగన్ పై కేసులో హైకోర్టు తీర్పు

  • శ్రీవారిని దర్శించుకునే అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలని నిబంధన
  • జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదంటూ వేసిన పిటిషన్ కొట్టివేత
  • వ్యక్తిగత హోదాలో వెళితేనే డిక్లరేషన్ ఇవ్వాలి ‌ 
  • ఆయన గురుద్వారాకూ వెళ్లారు, మరి సిక్కు మతాన్ని అనుసరిస్తున్నట్లా? 
తిరుమల శ్రీవారిని దర్శించుకునే అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఉన్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ వెళ్లిన నేపథ్యంలో డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో ఈ అంశంపై రగడ కొనసాగింది.

తిరుమల వెళ్లిన‌ జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వకపోవడం చట్ట విరుద్ధమని గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన రైతు ఆలోకం సుధాకర్‌బాబు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు 27 పేజీల తీర్పును వెలువరించింది. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ తీర్పు వెల్లడించారు. హిందూయేతరుడిగా వ్యక్తిగత హోదాలో వెళితేనే డిక్లరేషన్‌ అవసరమని చెప్పారు.

వైఎస్‌ జగన్‌ సీఎం హోదాలో బోర్డు ఆహ్వానం మేరకు తిరుమల వెళ్లారని గుర్తు చేశారు. జగన్‌పై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలను చూపడంలో పిటిషనర్‌ విఫలమయ్యారని కోర్టు తెలిపింది. జగన్ క్రైస్తవుడు అని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలను కోర్టు ముందుంచలేదని చెప్పింది. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేయడం, క్రైస్తవ సభలకు హాజరు కావడం వంటి వాటితో ఓ వ్యక్తిని ఆ మతానికి చెందిన వాడిగా పరిగణించలేమని తెలిపింది.

పిటిషనర్ చేస్తోన్న వాదనతో అధికరణ 226 కింద ఓ పిటిషన్‌ వేస్తే సరిపోదని చెప్పింది. ప్రమాణపూర్వక అఫిడవిట్ల రూపంలో ఆధారాలను కోర్టుకు సమర్పించాలని తెలిపింది. క్రైస్తవ సువార్త సమావేశాల్లో, చర్చి ప్రార్థనల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారని, దీంతో ఆయన క్రిస్టియన్‌ అవుతారని పిటిషనర్‌ చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది.

ఇటీవల విజయవాడ గురుద్వారలోనూ ఆయన ప్రార్థనలు చేశారని, ఆయన సిక్కు మతాన్ని అనుసరిస్తున్నట్లా? అని ప్రశ్నించింది. శ్రీవారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పించడం అనవాయితీగా వస్తోందని పిటిషనరే చెబుతున్నారని, సర్కారు తరఫున కైంకర్యపట్టి సమర్పించే అనవాయితీ చాలా కాలం నుంచే  టీటీడీ సాంప్రదాయాల్లో భాగంగా కొనసాగుతోందని కోర్టు పేర్కొంది.

సీఎంగా ఎవరున్నా ఆనవాయితీ కొనసాగుతూనే ఉందని చెప్పింది. గతంలో రాష్ట్రపతి హోదాలో అబ్దుల్‌ కలాం, ప్రధాని హోదాలో ఇందిరా గాంధీ వంటి వారు శ్రీవారిని దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్‌ ఇచ్చారని పిటిషనర్‌ చెబుతున్నారని, అయితే, వారిద్దరు దర్శనం, ప్రార్థనల నిమిత్తమే అక్కడకు వెళ్లారని కోర్టు తెలిపింది.


More Telugu News