Delhi: న్యూఇయర్ సెలెబ్రేషన్స్ పై ఉక్కుపాదం.. ఢిల్లీలో ఈ రాత్రి, రేపు రాత్రి కర్ఫ్యూ విధింపు!

Night Curfew In Delhi Today and Tomorrow To Restrict New Year Celebrations
  • మన దేశంలో నమోదవుతున్న కొత్త స్ట్రెయిన్ కేసులు
  • న్యూఇయర్ సెలబ్రేషన్లపై ఆంక్షలు విధించిన ఆప్ ప్రభుత్వం
  • కర్ఫ్యూ సమయంలో కనపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
దేశ రాజధాని ఢిల్లీలో ఈ రాత్రి, రేపు రాత్రి కర్ఫ్యూ విధించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఆప్ ప్రభుత్వం తెలిపింది. నిబంధనలను పట్టించుకోకుండా ఎవరైనా రోడ్లపై కనిపిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

మన దేశంలో కొత్త స్ట్రెయిన్ కేసులు 20 వరకు బయటపడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ ఆదేశాల నేపథ్యంలో, అన్ని ప్రభుత్వాలు తగు చర్యలను తీసుకుంటున్నాయి.

రాత్రి కర్ఫ్యూ సమయంలో ఎవరూ న్యూఇయర్ వేడుకలను ఇళ్ల బయట జరుపుకోకూడదని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. పబ్లిక్ స్థలాల్లో గుమికూడటం, సెలెబ్రేట్ చేసుకోవడం నిషిద్ధమని హెచ్చరించింది. కోవిడ్-19 కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ, కొత్త స్ట్రెయిన్ కేసులు బయటపడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

ఈ కొత్త స్ట్రెయిన్ ను సెప్టెంబర్ నెలలో యూకేలో తొలిసారి గుర్తించారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ కొత్త స్ట్రెయిన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే భారత్ తో పాటు పలు దేశాలకు విస్తరించింది. కొత్త వైరస్ కంట్రోల్ దాటిపోయిందంటూ యూకే ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.

ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా కఠిన ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాలు, ఫంక్షన్ హాల్స్ తదితర ప్రదేశాల్లో వేడుకలపై నిషేధం విధించారు. డ్రంకెన్ డ్రైవ్ లో దొరికితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Delhi
New Year Celebrations
Night Curfew

More Telugu News