JC Prabhakar Reddy: తన ఇంటిపై దాడి చేయడం పట్ల ఆగ్రహంతో ఊగిపోయిన జేసీ... ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూర్చున్న కుర్చీని తగులబెట్టిన అనుచరులు

JC Prabhakar Reddy fires after attack on his house in Tadipatri
  • తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలు
  • జేసీ ఇంటిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరుల దాడి
  • కిరణ్ అనే వ్యక్తికి గాయాలు
  • దాడి సమయంలో ఓ పెళ్లికి వెళ్లిన జేసీ
  • దాడి సమాచారంతో పోలీసులపై ఆగ్రహం

రాజకీయ వైషమ్యాలతో అనంతపురం జిల్లా తాడిపత్రి భగ్గుమంటోంది. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడిచేయడంతో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. జేసీ వద్ద పనిచేసే కిరణ్ అనే వ్యక్తి తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఎమ్మెల్యే కేతిరెడ్డి... జేసీ నివాసంపై దండెత్తారు. అక్కడే ఉన్న కిరణ్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. దాంతో జేసీ అనుచరులు తిరగబడడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. దాడిలో కిరణ్ కు గాయాలయ్యాయి.

ఈ క్రమంలో జేసీ నివాసంలోకి ప్రవేశించిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఓ కుర్చీలో కూర్చోగా, అనంతరం ఆ కుర్చీని జేసీ వర్గీయులు తగులబెట్టారు. కాగా, తన ఇంటిపై దాడి జరిగిందని తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టరాని ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. తన ఇంటిపై రాళ్లదాడి పట్ల ఆయన పోలీసులతో వాగ్యుద్ధానికి దిగారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తన ఇంటిపై దాడి చేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారని నిలదీశారు. కాగా, దాడి జరిగిన సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ పెళ్లికి వెళ్లినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News