Telugu: తెలుగు భాషకు అత్యంత గౌరవం.. అధికార భాష హోదా కల్పించిన మమతా బెనర్జీ ప్రభుత్వం!
- తెలుగువారిని భాషాపరమైన మైనార్టీలుగా గుర్తించిన ప్రభుత్వం
- ఖరగ్ పూర్ లో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగువారు
- అధికార భాష హోదా కోసం ఎప్పటి నుంచో డిమాండ్లు
దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడో కొనియాడారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటూ మరొకరు తెలుగు గొప్పదన్నాన్ని కీర్తించారు. అలాంటి తెలుగు భాషకు పశ్చిమబెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం అత్యంత గౌరవాన్ని కల్పించింది. తెలుగుకు అధికార భాష హోదాను కల్పిస్తూ మమత సర్కారు నిర్ణయం తీసుకుంది. బెంగాల్ లో నివసిస్తున్న తెలుగువారిని భాషాపరమైన మైనార్టీలుగా గుర్తించింది. పశ్చిమబెంగాల్ లో ఇప్పటికే హిందీ, నేపాలీ, ఉర్దూ, ఒడియా, గురుముఖి భాషలకు అధికార భాష హోదా ఉంది.
బెంగాల్ లో పెద్ద సంఖ్యలో తెలుగువారు నివసిస్తున్నారు. అక్కడున్న పారిశ్రామిక నగరం ఖరగ్ పూర్ 'మినీ ఆంధ్ర'గా గుర్తింపు పొందింది. ఖరగ్ పూర్ మున్సిపాలిటీలోని 35 వార్డుల్లో ఆరింట తెలుగువాళ్లే కౌన్సిలర్లుగా ఉండటం గమనార్హం. తెలుగు భాషకు అధికార భాష హోదా ఇవ్వాలని అక్కడివారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.