DMK: స్టాలిన్ సమక్షంలో హిందూమతంపై వివాదాస్పద వ్యాఖ్యలు

  • హిందూ మతం రెండు శతాబ్దాల నాటిదేనన్న శివ భక్తురాలు 
  • స్టాలిన్ హిందూ వ్యతిరేకి అంటూ బీజేపీ మండిపాటు
  •  క్రైస్తవుల ఓట్ల కోసం కావాలనే అలా చెప్పిస్తున్నారని ఆరోపణ
Tamil preacher controversial comments on Hinduism

డీఎంకే చీఫ్ స్టాలిన్ సమక్షంలో మతబోధకురాలు ఒకరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చెన్నైలో ఇటీవల జరిగిన క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళయరసి నటరాజన్ అనే శివ భక్తురాలు మాట్లాడుతూ హిందూ మతంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు హిందూ మతమన్నదే లేదనీ, ఇప్పుడున్న ఆ మతం ఉనికి రెండు శతాబ్దాల క్రితం నాటిదేనని, మనం శైవులం మాత్రమేనని, అంతకంటే ముఖ్యంగా మనం తమిళులమని పేర్కొన్నారు. ఆమె ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు స్టాలిన్ పక్కనే ఉన్నప్పటికీ వారించలేదని హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

బీజేపీ కూడా స్టాలిన్‌పై మండిపడింది. ఆయన హిందూ వ్యతిరేకి అని ఆరోపించింది. క్రైస్తవుల ఓట్లను సాధించేందుకు డీఎంకే కావాలనే ఇలా మాట్లాడిస్తోందని తమిళ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరం మురుగన్‌ను పూజిస్తామని, ఆయనను అవమానించడం విచారకరమని తమిళనాడు బీజేపీ చీఫ్ ఎల్ మురుగన్ అన్నారు. డీఎంకే హిందూ వ్యతిరేకి అని, డబ్బులిచ్చి మరీ హిందూమతంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి ఆరోపించారు. క్రిస్టియన్ల ఓట్లు సంపాదించేందుకే ఇలా చేస్తోందని మండిపడ్డారు.

More Telugu News