Sajjanar: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటాం: సజ్జనార్

Will take legal action on BJP MLA Raja Singh says CP Sajjanar
  • డబ్బు కోసం ఆవుల అక్రమ రవాణాకు పోలీసులు సహకరిస్తున్నారన్న రాజాసింగ్
  • బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్న సజ్జనార్
  • పోలీసుల మీద, డీజీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం
బీజేపీ నాయకులు పోలీసుల నైతికత దెబ్బతినేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. పోలీసులను ఉద్దేశించి బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. పోలీసుల మీద, డీజీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని అన్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్ర నుంచి హైదరాబాదుకు ఆవులను తరలిస్తున్న లారీని నిన్న రాత్రి రాజాసింగ్ పట్టుకున్నారు. చౌటుప్పల్ చెక్ పోస్టు వద్ద లారీని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ పోలీసులు డబ్బుల కోసం ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై డీజీపీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే తామే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు.
Sajjanar
CP
Raja Singh
BJP

More Telugu News