App Loans: యాప్ లోన్ వ్యవహారంలో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు... ఇప్పటివరకు 11 మంది  అరెస్ట్

Police investigates app loans incidents
  • యాప్ ల ద్వారా తక్షణ రుణాలంటూ ప్రలోభాలు
  • ఆపై అధిక వడ్డీలతో వేధింపులు
  • ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న బాధితులు
  • ఢిల్లీలో ఐదుగురు, హైదరాబాదులో ఆరుగురు అరెస్ట్
  • ఏపీలో స్పెషల్ డ్రైవ్ లు చేపడతామన్న డీజీపీ
ఆన్ లైన్ లో అప్పు తీసుకుని, ఆపై తీవ్ర ఒత్తిళ్లతో ఆత్మహత్యకు పాల్పడుతున్న వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరుగుతోంది. దీనిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు తీవ్రస్థాయిలో దృష్టి సారించారు. తక్షణ రుణాల పేరుతో అధిక వడ్డీలు, జరిమానాలతో ప్రజల రక్తం పిండుతున్న మైక్రోఫైనాన్స్ యాప్ ల భరతం పట్టేందుకు రంగంలోకి దిగారు. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, గుర్గావ్, బెంగళూరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

ఢిల్లీలో ఐదుగురిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు, హైదరాబాదులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ యాప్ లోన్ సంస్థలకు చెందిన 2 టెలికాలర్ విభాగాల్లో సోదాలు చేసి 11 మందిని అరెస్ట్ చేసినట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి సునీల్ లోన్ యాప్ ల సిబ్బంది వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసు శాఖ ఈ యాప్ లపై తీవ్రస్థాయిలో దృష్టి సారించింది.

ఇదే అంశంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా స్పందించారు. బాధితులు ధైర్యంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. నోయిడా, ఢిల్లీ, గుర్గావ్ ల నుంచి ఈ మనీ లోన్ యాప్ లు నిర్వహిస్తున్నట్టు తెలిసిందని చెప్పారు. మొబైల్ లోన్ యాప్ ల వ్యవహారంలో ఏపీ వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ లు చేపడుతున్నామని వెల్లడించారు.
App Loans
Instant
Money
Police
Telangana
Andhra Pradesh

More Telugu News