కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ వోరా కన్నుమూత
- ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న వోరా
- ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిక
- వెంటిలేటర్ పై చికిత్స
- పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ
సీనియర్ రాజకీయ వేత్త వోరా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మోతీలాల్ వోరా కాంగ్రెస్ సీనియర్ నేతల్లో అపారమైన పాలనా అనుభవం ఉన్నవాడని మోదీ కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.
మోతీలాల్ వోరా తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఉన్నత పదవులు చేపట్టారు. మధ్యప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఉత్తరప్రదేశ్ కు గవర్నర్ గా పనిచేశారు. అంతేకాదు, కాంగ్రెస్ కు ఏకంగా 16 ఏళ్ల పాటు కోశాధికారిగా వ్యవహరించారు.
వోరా మృతిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, ఆయన నిజమైన కాంగ్రెస్ వాది అని కీర్తించారు. ఎంతో మంచి వ్యక్తి అని, మోతీలాల్ వోరా సేవలను ఎంతగానో కోల్పోతున్నామని తెలిపారు.