Arvind Kejriwal: అసెంబ్లీలో వ్యవసాయ చట్టాల ప్రతులను చించేసిన కేజ్రీవాల్

Kejriwal tears farm laws copies in assembly
  • వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని చెపుతున్నారు
  • అలాంటప్పుడు రైతులు ఆందోళన ఎందుకు చేస్తారు?
  • కొందరు బీజేపీ నేతలు రైతులను దేశద్రోహులు అంటున్నారు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను బీజేపీయేతర పాలిత రాష్ట్రాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఈ చట్టాలను తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీ శివార్లలో ధర్నా చేస్తున్న రైతులను కూడా ఆయన కలిశారు. ఈరోజు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ చట్టాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

బ్రిటీష్ వాళ్లకంటే దారుణంగా తయారుకావద్దని కేజ్రీవాల్ అన్నారు. లాక్ డౌన్ సమయంలో ఏదో కొంపలు మునిగిపోయినట్టు హడావుడిగా ఈ బిల్లులను ఆమోదించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఈ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని చెపుతున్నారని... అలాంటప్పుడు రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారని నిలదీశారు. ఈ మూడు వ్యవసాయ చట్టాలను చించేస్తున్నానని చెపుతూ ప్రతులను చించేశారు.

కొందరు బీజేపీ నేతలు రైతులను దేశద్రోహులు అంటున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. చాలా మంది సెలబ్రిటీలు, గాయకులు, మాజీ ఆర్మీ ఉద్యోగులు, డాక్టర్లు రైతులకు మద్దతుగా నిలిచారని... వారంతా కూడా దేశద్రోహులేనా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ తీరు వల్ల ప్రతి రైతు ఒక భగత్ సింగ్ లా తయారవుతాడని అన్నారు.
Arvind Kejriwal
AAP
Farm Laws
BJP

More Telugu News